సహకార సంఘం పెట్రోల్ బంక్‌ను కాపాడాలి
పాలకవర్గం రద్దుతో రికవరీ ఎవరు చేస్తారు?
రూ.50 లక్షల క్రెడిట్ బాకీలపై సీపీఐ ఆందోళన
బాకీల పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్
కాకతీయ, చెన్నారావుపేట : చెన్నారావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్‌ను కాపాడాలని సిపిఐ మండల కార్యదర్శి పత్తి అనంతరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెట్రోల్ బంక్‌లో పాలకవర్గం సభ్యులు, ఉద్యోగస్తులు కలిసి కొందరు నాయకులు, వాహనదారులకు క్రెడిట్ రూపంలో సుమారు రూ.50 లక్షల విలువైన పెట్రోల్, డీజిల్ సరఫరా చేశారని ఆరోపించారు.
బాకీల వసూలుపై అనిశ్చితి
ప్రస్తుతం పాలకవర్గం రద్దు కావడంతో ఆ క్రెడిట్ బాకీలను ఎవరు వసూలు చేస్తారనే అంశం అనుమానంగా మారిందని అనంతరెడ్డి పేర్కొన్నారు. ఇష్టారాజ్యంగా క్రెడిట్ ఇచ్చిన కారణంగా పెట్రోల్ బంక్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత ఉద్యోగులు మేల్కొని బాకీలను రికవరీ చేయకపోతే బంక్ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పేర్లు బహిర్గతం చేయాలి
క్రెడిట్ తీసుకున్న వ్యక్తుల పేర్లు బహిరంగంగా ప్రకటించాలని, వెంటనే బాకీలు వసూలు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. రైతుల సొమ్ముతో నడిచే సహకార సంఘాన్ని నష్టాలపాలు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. డబ్బుల రికవరీకి చర్యలు తీసుకోకపోతే రైతులను సమీకరించి ఉద్యమాలు చేపడతామని పత్తి అనంతరెడ్డి స్పష్టం చేశారు


