గడువులోగా గురుకులాల నిర్మాణం పూర్తవ్వాలి
పోనేకల్లులో అత్యాధునిక వసతులతో భవన నిర్మాణాలు
చదువు తో పాటు క్రీడలకు ప్రాధాన్యం
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం : యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణాన్ని నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ విద్యాసంస్థలను నిర్మిస్తున్నామని తెలిపారు. బుధవారం పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం పోనేకల్లు గ్రామంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనుల నాణ్యత, భవనాల నమూనాలు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. లింక్ రోడ్లు, అంతర్గత రహదారులు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలు సమగ్రంగా ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలకు అనుకూలంగా అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో 5 యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సమీకృత పాఠశాలలు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తాయని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని, పనుల పురోగతిపై తరచూ నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఈఈ బుగ్గయ్య, తహసీల్దార్ యం వినయేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


