- హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది
- వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
- మాజీ మంత్రి హరీశ్ రావు
- సిద్దిపేటలో బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. బుధవారం సిద్ధిపేటలో ఆయన పర్యటించారు. పట్టణంలోని 7వ వార్డులోని కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలను మోసం చేసిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ. 4000 ఇస్తా అని మాట తప్పింది
‘ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పింఛన్ 4000 ఇస్తా అని మాట తప్పింది. కేసీఆర్ రూ.200పెన్షన్ ను రూ.2 వేలు చేస్తా అన్నాడు. చెప్పిన మాటను అమలు చేసి మాట నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు మహాలక్ష్మి కింద రూ.2500, తులం బంగారం అన్నారు. చివరకు కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రి లో కేసీఆర్ కిట్ కూడా ఇవ్వడం లేదు. అలానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్ధిపేటను దేశానికి ఆదర్శంగా నిలిపాను. రాబోయే రోజుల్లో సిద్ధిపేటను మరింత అభివృద్ధి చేసుకుందాం. సిద్దిపేటలో మంచి నీళ్ల కు శాశ్వత పరిష్కారం చేశాం. వచ్చే ఎన్నికల్లో గెలిచి…కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది’ అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.


