బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు సర్పంచ్ ఎన్నికలను అడ్డుకుంటాం
బీసీ హక్కులపై కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఆపాలి
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ యూ టర్న్ సిగ్గుచేటు
బీసీలకు న్యాయం చేయకపోతే కాంగ్రెస్, బీజేపీ భూస్థాపితం చేస్తాం
బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్
కాకతీయ, వరంగల్ బ్యూరో : స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు న్యాయం చేయకపోతే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలను భూస్థాపితం చేస్తామని బీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలోని పూలే దంపతుల విగ్రహాలకు ఉమ్మడి వరంగల్ బీసీ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మించి రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిందని అన్నారు.మహాత్మా జ్యోతిరావు పూలే దశాబ్దాల క్రితమే వెనుకబడిన వర్గాల కోసం విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో సమాన వాటా కల్పించాలని కలలు కన్నారు. జనాభాలో 60% ఉన్న బీసీలకు వాటా ఇవ్వాలని బీసీలు పోరాడుతున్నప్పటికీ, అగ్రవర్ణాలకు చెందిన రాజకీయ పార్టీల నుంచి స్పందన లేదని వేణుగోపాల్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు రిజర్వేషన్లు పెంచకుండా, కేంద్రంపై పోరాడకుండా 23% రిజర్వేషన్లను 17%కు తగ్గించి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం సిగ్గుచేటు అని తీవ్రంగా మండిపడ్డారు.బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బీజేపీ, రిజర్వేషన్లు పెంచకుండా రెడ్ల ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ రెండూ బీసీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. బీసీల కోసం పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానిని ఒత్తిడి చేయాలని అన్నారు. డిసెంబర్ తొలి వారంలో జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి 243 మంది ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింప చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఒప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు డా. చిర్ర రాజు గౌడ్, దాడి మల్లయ్య యాదవ్, డా. సంగాని మల్లేశ్వర్, బోనగాని యాదగిరి, తమ్మేలా శోభరాణి, భీమగాని యాదగిరి, కాసగాని అశోక్ గౌడ్, సమ్మయ్య, బక్కి అవినాష్ పటేల్, తెల్ల సుగుణ, కిషోర్, ప్రమోద, మానస తదితరులు పాల్గొన్నారు.


