కాంగ్రెస్ కూటమి గాలి వీస్తోంది
ప్రజా శ్రేయస్సే కాంగ్రెస్ ధ్యేయం
మధిరలో అనూహ్య అభివృద్ధి ఖాయం
ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ హుస్సేన్ సాహెబ్
కాకతీయ, మధిర : మున్సిపల్ ఎన్నికల్లో మధిర పట్టణంలో కాంగ్రెస్ కూటమి గాలి స్పష్టంగా వీస్తోందని తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ హుస్సేన్ సాహెబ్ అన్నారు. మధిర మున్సిపాలిటీలోని 22 వార్డుల వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, ముస్లిం ఐక్య సంఘం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి షేక్ రషిదున్ గెలుపు కోసం ఆదివారం 13వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, కాంగ్రెస్ సీనియర్ నేత రంగా హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ హుస్సేన్ మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో మధిర మున్సిపాలిటీలో అనూహ్యమైన అభివృద్ధి జరుగుతోందని అన్నారు. పరిశ్రమలు రావడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. ఇప్పటికే అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో మైనార్టీలకు సముచిత ప్రాధాన్యం లభించిందని, కాంగ్రెస్ కూటమి అందరి పక్షాన నిలబడుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ, ముస్లిం ఐక్య సంఘం కలిసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 13వ వార్డు అభ్యర్థి షేక్ రషిదున్‌కు హస్తం గుర్తుపై ఓటేసి విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.


