కోల్డ్‌వార్ కంటిన్యూ..!
పొంగులేటి, కొండా మధ్య ముదిరిన వివాదం
దేవాదాయ శాఖ మంత్రి లేకుండానే మేడారం జాతర సమీక్షకు రెఢీ
నేడు జాతర పనులపై పొంగులేటి, సీతక్క ఉన్నత స్థాయి సమీక్ష
టెండర్ల విషయంలో మంత్రుల మధ్య మొదలైన రగడ
పొంగులేటి పెత్తనమేంటని అధిష్ఠానానికి కొండా దంపతుల ఫిర్యాదు
ఫిర్యాదు తర్వాత కొండా మురళీపై సీఎం అసహనం చేసినట్లుగా ప్రచారం
ఈ ఘటన తర్వాతే పొంగులేటి మేడారం పర్యటన షెడ్యూల్ ఖరారు
ఆదివారం వరంగల్‌లో పర్యటించినా రెవెన్యూ శాఖ మంత్రి నో కామెంట్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మేడారం టెండర్ల విషయంలో మంత్రులు పొంగులేటి, దేవాదాయ శాఖ మంత్రి సురేఖల మధ్య మొదలైన రగడ కంటిన్యూ అవుతోంది. వరంగల్ జిల్లాపై రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి పెత్తనమేంటని ప్రశ్నిస్తూ.. మేడారం టెండర్ల విషయంలో ఆయన చెప్పిందే చేశారని పేర్కొంటూ కాంగ్రెస్ అధిష్ఠానానికి కొండా దంపతులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లాలో తనకు తెలియకుండా దేవాదాయ శాఖలో నిర్ణయాలు జరిగిపోతున్నాయంటూ కొండా సురేఖ అధిష్ఠానంపెద్దలకు పొంగులేటిపై ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలపై మంత్రి పొంగులేటి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. అయితే కొండా మురళి, కొండా సురేఖలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అసహనం వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. మేడారం జాతర అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. టెండర్ల విషయంలో ఇలా అధిష్ఠానం దాక ఫిర్యాదులు చేయడంఏంటని..? అంటూ సీఎం కొంత ఆగ్రహంతో ఉన్నట్లుగా సమాచారం.
నేడు సురేఖ లేకుండానేసమీక్ష..!
సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క మేడారంలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా సమ్మక్క, సారలమ్మ మహా జాతర 2026 ఏర్పాట్ల పై ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర్ స్పష్టం చేశారు. అయితే పర్యటన షెడ్యూల్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రస్తావన లేకపోవడంతో ఆమె సమీక్షకు దూరంగా ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. మేడారం టెండర్ల విషయంలో మంత్రుల మధ్య తలెత్తిన విబేధాలకు ముగింపు మార్గం కనిపించకపోవడం గమనార్హం. వాస్తవానికి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా పొంగులేటి పర్యటనలు ఎక్కువగా ఉండటం, ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులతో పొంగులేటి ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుతుండటం, పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన దిశా నిర్దేశనం జరుగుతోందన్న వాదనను కొండా వర్గం నుంచి వినిపిస్తోంది. జిల్లా మంత్రిగా కొండా సురేఖకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కకపోవడానికి ఆయన అనుసరిస్తున్న వైఖరియే కారణమంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే జిల్లా ఇన్చార్జి మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగానే ఆయన ప్రభుత్వ గైడ్‌లైన్‌లోనే, ప్రొటోకాల్ ప్రకారమే పర్యటనలు జరుపుతున్నట్లుగా కూడా కాంగ్రెస్‌లోని మిగతా క్యాడర్ వాదిస్తుండటం గమనార్హం. జిల్లాలో రాజకీయ ఆధిపత్య పొరే..ప్రచ్చన్న రాజకీయ యుద్ధానికి దారితీస్తోందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
నో కామెంట్..!
మేడారం జాతర టెండర్ల విషయంలో పొంగులేటిపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన కొండా దంపతులు ఇప్పుడు ఈ విషయంపై బహిరంగగా ఎలాంటి కామెంట్లు చేయడంలేదు.అసలేం జరిగిందనే విషయాన్ని మీడియాకు వివరించేందుకు ఇష్ట పడటం లేదని సమాచారం. అదే సమయంలో మేడారం అభివృద్ధి పనులను త్వరత గతిన పూర్తి చేయాలని ప్రభుత్వం చూస్తున్న తరుణంలో మంత్రుల వివాదం తెరపైకి రావడంతో సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంపై పొంగులేటి సైతం ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఇటీవల మాతృ వియోగం జరగగా…ఆదివారం పొంగులేటి పరామర్శకు హన్మకొండకు వచ్చారు. హన్మకొండలో ఉండగానే మంత్రి మేడారం షెడ్యూల్ ఖరారైంది. అయితే పొంగులేటితో మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించినా.. ఈ విషయంపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయకుండానే వెళ్లిపోవడం గమనార్హం.


