పాప బయపడుతుంది మేం చదువు చెప్పం
పాఠశాలలో పాము కరిచిందని భయపడ్డ 5వ తరగతి విద్యార్థిని వల్లందాసు శివాని
విద్యార్థినికి చదువు చెప్పకుండా వెళ్లగొట్టిన గురుకుల టీచర్లు
వరంగల్ జిల్లా పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల టీచర్ల కర్కశత్వం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్య బోధించాల్సిన టీచర్లే విద్యార్థినిని బడికి రానివ్వకుండా చదువు చెప్పమని విద్యార్థిని జీవితాన్ని ఆగం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నాలుగు నెలల నుండి విద్యార్థిని వల్లందాసు శివాని చదువు మానేసి ఇంటి వద్ద పనులు చేస్తున్నది.
పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన వల్లందాసు శివాని అనే విద్యార్థిని నాలుగో తరగతి వరకు సొంత గ్రామంలోనే చదువుకొని ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి పర్వతగిరి మండల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీటు తెచ్చుకొని ఈ విద్యా సంవత్సరం ఐదవ తరగతి లో చేరింది. స్కూల్ ప్రారంభం నుంచి బాగానే ఉన్న నాలుగు నెలల తర్వాత పాఠశాలలో పామును చూసి భయపడింది. భయపడిన విద్యార్థినికి ధైర్యం చెప్పాల్సిన టీచర్లే మేము చదువు చెప్పం, విద్యార్థిని శివాని గగ్గోలు పెట్టి మమ్మల్ని బద్నాం చేసిందని, ఆమె తమకు వద్దని, వచ్చినా చదువు చెప్పమని టీచర్లు పాఠశాల నుండి విద్యార్థిని వెల్లగొట్టారు.
విద్యార్థిని తల్లి పాప విద్యా సంవత్సరం నాశనం అవుతుందని కనీసం కొన్ని రోజులు మీ పాఠశాలలో చదువు చెప్పి చూడండి పాప భయపడకుంటేనే మీ పాఠశాల ఉంచుకోండి అని టీచర్లను బ్రతిమిలాడిన కూడా గురుకుల పాఠశాల టీచర్లు కనుకరించలేకపోయారు. విద్యార్థిని తల్లి ఆవేదనను టీచర్లు పట్టించుకోకుండా కర్కశంగా మీ పాప టీసీని పోస్టులో పంపించాం, మీకు ఇంకా టీసీ రాలేదా మళ్ళీ స్కూల్ కి ఎందుకు వస్తున్నారని బయటకి నెట్టేసి పాఠశాల గేట్లు మూసివేసారని, ఇక చేసేదేమీ లేక ఈ విద్యా సంవత్సరం అయిపోయే వరకు తమ పాప ఇంటి వద్దే పనులు చేస్తూ ఉంటుందని, శివాని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



