ఉపాధి హక్కుపై కేంద్రం కత్తి!
విబిజి రాంజీ చట్టం రద్దు చేయాలి
ఖమ్మంలో కాంగ్రెస్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన
కాకతీయ, ఖమ్మం : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (మన్‌రేగా) తక్షణమే పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి రాంజీ (వికాస్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్) చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 43, 44, 45, 49వ డివిజన్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట సమావేశమై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి మాట్లాడుతూ… ప్రజలకు ఉపాధి హక్కు, పంచాయతీల పాలన హక్కును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. గ్రామపంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన అధికారాలను నిర్వీర్యం చేస్తూ, మన్‌రేగాను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందన్నారు. మన్‌రేగా స్థానంలో తీసుకొచ్చిన విబిజి రాంజీ చట్టం గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇది ఉపాధి హక్కును హరించే ప్రమాదకరమైన విధానమని విమర్శించారు. ఈ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తిరస్కరిస్తోందని స్పష్టం చేశారు.
రాష్ట్రాలపై ఆర్థిక భారం
గతంలో మన్‌రేగా పనులకు సంబంధించిన వేతనాలు 100 శాతం కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చేవని, ఇప్పుడు కేంద్రం కేవలం 60 శాతం మాత్రమే భరిస్తూ మిగతా 40 శాతం భారం రాష్ట్ర ప్రభుత్వాలపై మోపుతోందని దీపక్ చౌదరి తెలిపారు. దీని వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగి, నిధుల కొరత, వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఇది గ్రామీణ కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకుంటోందని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాములు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, డీ-బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలగంగా తిలక్, నరాల నరేష్, పాలపు వెంకటరమణ, గుడిపూడి జగదీష్, కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు, కాంపటి వెంకన్న, బాణాల లక్ష్మణ్, ఎండీ ఫజల్, ఐఎన్‌టీయూసీ నాయకులు విప్లవ్ కుమార్, అనంత లక్ష్మి, ఎదునుతల ప్రభాకర్, గండం వెంకటయ్య, బోపురి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.


