- రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలులో కేంద్రప్రభుత్వ తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేంద్రం ఇప్పటికీ ఆమోదించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ బిడ్డలుగా కేంద్ర మంత్రులు చొరవ చూపించాలని, తెలంగాణలో ప్రజల సంక్షేమానికి, బీసీల హక్కులకు మీరు ముందుండాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించేలా డిల్లీలో కేంద్ర మంత్రులు ప్రయత్నించాలని అన్నారు. అవసరమైతే తాము కూడా మీతో కలిసి డిల్లీకి వస్తామని మంత్రి ప్రకటించారు. బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను శాసనసభలో ఆమోదించిందని అయితే కేంద్రం ఆ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచిందని మంత్రి తెలిపారు. ఇది కేవలం కాంగ్రెస్ లేదా బీజేపీకి సంబంధించిన విషయం కాదని ఇది బీసీల భవిష్యత్తును నిర్దేశించే అంమని అన్నారు.


