ఆపరేషన్ కగార్’తో మారణకాండ కొనసాగిస్తున్న కేంద్రం
తుడుందెబ్బ నేతలు రమణాల లక్ష్మయ్య, వట్టం ఉపేందర్
ఆదివాసీ హక్కుల బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ
కాకతీయ, బయ్యారం :
ఆదివాసీ హక్కులు, వ్యవస్థల కార్పొరేటీకరణ, కగార్ హత్యాకాండ, కాల్పుల విరమణ అంశంపై ఈ నెల 24న ఆదివాసీ హక్కుల పోరాట ఐక్య వేదిక అధ్వర్యంలో హన్మకొండ అంబేద్కర్ భవన్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని బయ్యారం మండల ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక అధ్వర్యంలో శుక్రవారం కొత్తపేట గ్రామంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షుడు రమణాల లక్ష్మయ్య, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ మాట్లాడుతూ.. మధ్యభారత దేశంలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్లకు, కట్టబెట్టడం కోసం దండకారణ్యంలోని ఆదివాసీలను, వారి పక్షాన పోరాడుతున్న మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరిట అంతమొందించాలని ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అన్నారు. ఆదివాసులపై హత్యాకాండను కొనసాగిస్తూ మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తూ అడవి నుండి ఆదివాసులను వెళ్లగొట్టి, బహుళ జాతి కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు అపారమైన ఖనిజ సంపదను అప్పనంగా అప్పజెప్పి ప్రయత్నంలో భాగంగానే ఆదివాసీలను నిర్వాసితులుగా చేస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందని, కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల జీవించే హక్కును కాలరాస్తుందని, ఆదివాసీల రక్షణకోసం రూపొందించిన చట్టాలను తుంగలో తొక్కుతూ ఆపరేషన్ కగార్ పేరిట మారణకాండ ను కొనసాగిస్తుందని, ఆదివాసీల మీద హత్యాకాండ కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపేయాలని అన్నారు. ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మేధావులు, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక అధ్వర్యంలో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల మండల అధ్యక్షుడు అలెం క్రిష్ణ, అలేం హరీష్, ఏప అశోక్, బొల్లి మల్సూర్, ఈర్ప శ్రీధర్, తాటి లక్ష్మీనారాయణ, ఏప రవిబాబు తదితరులు పాల్గొన్నారు.


