- మూడో రోజూ ఆగని ఆందోళనలు
- పాక్ బలగాల కాల్పుల్లో 8 మంది మృతి
- మూతపడిన మార్కెట్లు, దుకాణాలు
కాకతీయ, నేషనల్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అట్టుడుకుతోంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఓకేలో ప్రజలు చేపట్టిన భారీ నిరసనలు మూడో రోజూ కొనసాగాయి. బుధవారం నిరసనల్లో 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బాగ్ జిల్లా ధీరకోట్‌లో నలుగురు, ముజఫకాబాద్, మీర్‌పూర్‌లో ఇద్దరు చొప్పున పాక్ బలగాల కాల్పుల్లో మృతి చెందారు. మంగళవారం ముజఫరాబాద్‌లో మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య పదికి చేరింది. పీఓకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు సైతం నిరాకరిస్తున్నారంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గత 72 గంటలుగా భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో మార్కెట్లు, దుకాణాలు, స్థానిక వ్యాపారాలు మూతపడ్డాయి. రవాణా సర్వీసులు నిలిచిపోయాయి.
38 డిమాండ్లపై లాంగ్ మార్చ్..
ముజఫరాబాద్‌లో నిరసనకారులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారని, భద్రతా బలగాలు షెల్లింగ్స్‌తో విరుచుపడ్డాయని, దీంతో పలువురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని జేఏసీసీ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్ధులకు పీఓకే అసెంబ్లీలో 12 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేయడాన్ని రద్దు చేయడంతో సహా 38 డిమాండ్లపై ముజఫరాబాద్ ‘లాంగ్ మార్చ్’కు జేఏసీసీ పిలుపునిచ్చింది. గత 70 ఏళ్లుగా తాము ప్రాథమిక హక్కులకూ నోచుకోవడం లేదని, తమ డిమాండ్లు నెరవేర్చకుంటే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని జేఏసీసీ నేత సౌకత్ నవాజ్ మీర్ హెచ్చరించారు.
భారీగా సాయుధ బలగాలు మోహరింపు
కాగా, పీఓకేలోని నిరసనలను బలప్రదర్శనతో అణచివేసేందుకు ఇస్లామాబాద్ భారీగా బలగాలను దింపుతోంది. పీఓకే పట్టణాల్లో భారీగా సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తున్నాయి. 1,000 అదనపు ట్రూప్‌లను రాజధాని ఇస్లామాబాద్‌లో మోహరించింది. గత వారంలో ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని ఒక గ్రామంపై పాక్ బాంబులతో విరుచుకుపడింది. చైనా తయారు చేసిన ఎల్-6 లేజర్ గైడెడ్ బాంబులను చైనా మేడ్ జే-17 ఫైటర్ జెట్ల నుంచి పెద్దఎత్తున జారవిడచడంతో 30మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే పీఓకేలో పెద్దఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి.


