కార్యదర్శులకు అప్పుల భారం
గ్రామాల్లో వసతుల కల్పనకు తిప్పలు
పంచాయతీ ఉద్యోగులపైనే జీపీల నిర్వహణ భారం
పెట్రోల్ బంకుల్లో వేలల్లో ఖాతాలు
ట్రెజరీ నుండి నిధుల విడుదలకు జాప్యం
తీవ్ర ఒత్తిడిలో క్షేత్రస్థాయి ఉద్యోగులు
కాకతీయ,గీసుగొండ : దేశ అభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలు అని నానుడి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీల పరిస్థితి దయనీయంగా మారింది. సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండగా, నిధుల కొరతతో పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిధుల లేమితో అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. గ్రామపంచాయతీలలో సర్పంచుల పాలన లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన నిధులు నిలిచిపోవడంతో గ్రామాలలో చేయవలసిన అభివృద్ధి పనులు కుంటుపడి, గ్రామాల అభివృద్ధి కుంటుపడింది.
కార్యదర్శుల అప్పుల తిప్పలు..
గ్రామాలలో సర్పంచులు లేకపోవడంతో గ్రామ సంరక్షణ పంచాయతీ కార్యదర్శుల పైన పడుతోంది. దీంతో గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాలైన వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య పనులు,చెత్త సేకరణ, మంచినీటి సరఫరా వంటి పనులను నిర్వహించ డానికి కార్యదర్శులు సొంతంగా అప్పులు చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పంచాయతీలో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని జిల్లా ట్రెజరీ అకౌంట్లో జమ చేస్తారు. కానీ గ్రామ అభివృద్ధి కోసం ఖర్చుపెట్టిన డబ్బుల కోసం ట్రెజరీలో దరఖాస్తు చేసుకుంటే నిధుల విడుదలకు తీవ్ర జాప్యం జరుగుతుందని ఓ మండల స్థాయి అధికారి తెలిపారు. గతంలో వసూలు చేసిన పనులను గ్రామ బ్యాంకు ఖాతాలో జమ చేసి ఖర్చులకోసం నిధులను విడుదల చేసుకునే అవకాశం ఉండేదని ప్రభుత్వ కొత్త విధానంతో ఆ అవకాశం లేకుండా పోయిందని తెలిపారు.
సొంతంగా అప్పులు చేసి పనులు కొనసాగిస్తున్నాం..
గీసుగొండ మండల కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు శంకర్ రావు
గ్రామాలలో సర్పంచులు లేకపోవడంతో గ్రామ పంచాయతీల నిర్వహణ మాపై పడిందని, గ్రామ ప్రజల మౌలిక సదుపాయాల కోసం సుమారు మూడు లక్షల రూపాయలు సొంతంగా అప్పు చేసి ఖర్చు చేశానని గీసుగొండ మండల కార్యదర్శిల సంఘం అధ్యక్షుడు కొమ్మాల గ్రామపంచాయతీ కార్యదర్శి శంకర్ రావు ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ నడిపించుటకు పెట్రోల్ బంకులో ఇప్పటికే 50,000 ఖాతా పెట్టగా ఖాతా కట్టకపోతే ట్రాక్టర్ల ఇకపై డీజిల్ పోసేది లేదని బంకు యాజమాన్యం అంటున్నారు. పై అధికారులకు చెప్పుకోలేక విధులు నిర్వహించలేక తీవ్రమైన ఒత్తిడి గురవుతున్నామని తెలిపారు.
ప్రస్తుతం పల్లెల్లో ఏర్పడిన ఈ సమస్యలను అధిగమించడానికి గ్రామ పంచాయతీలకు సమయానుకూలంగా నిధులు విడుదల కావడమే ఒక్కటే పరిష్కారం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే, అప్పుల్లో కూరుకుపోతున్న కార్యదర్శుల సమస్య మరింత తీవ్రమై, పల్లెల అభివృద్ధి పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వస్తుందంటున్నారు.


