కొమ్మాల జాతర ఘనంగా జరగాలి
రూ.1.45 కోట్లతో ప్రధాన రహదారి నిర్మాణానికి వేగం
బావుల భద్రతకు కాంక్రీట్ గోడలు నిర్మించాలి
ప్రభ బండ్ల రాకపోకలకు శాశ్వత రహదారులపై దృష్టి
రైతులకు కౌలు చెల్లించి పార్కింగ్ వినియోగం చేయాలి
అధికారులకు ఎమ్మెల్యే రేవూరి ఆదేశాలు
కాకతీయ, గీసుగొండ: ప్రతిష్టాత్మక కొమ్మాల జాతరను ఎలాంటి లోపాలు లేకుండా సమన్వయంతో విజయవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని కొమ్మాల ఆలయ ప్రాంగణంలోని విష్ణుప్రియ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాతర ఏర్పాట్లపై అధికారులను నిలదీస్తూ పురోగతిని సమీక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రూ.1.45 కోట్ల అంచనాతో ప్రధాన రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఇప్పటికే 410 మీటర్ల సీసీ రోడ్డు పూర్తి కాగా, మరో 400 మీటర్ల బీటీ రోడ్డు పనులను ఈ నెల 25లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
బావుల భద్రతకు ప్రత్యేక చర్యలు
ప్రధాన రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావులు ప్రమాదకరంగా మారే అవకాశమున్నందున వాటి చుట్టూ కాంక్రీట్ గోడలు నిర్మించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అవసరమైతే రహదారి వ్యయాన్ని తగ్గించినా భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. గత జాతరతో పోలిస్తే ఈసారి ప్రభుత్వం 16 మంది జిపిఓలను నియమించిందని, వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. తహసీల్దార్ రియాజుద్దీన్ మాట్లాడుతూ జాతరకు వచ్చే ప్రధాన మార్గాల్లో ప్రమాదకరంగా ఉన్న ఆరు బావులను గుర్తించి హెచ్చరిక బోర్డులు, భారీ గేట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు
జాతర ప్రాంతమంతా సమగ్ర లైటింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. కొమ్మాల గ్రామం నుంచి చెరువు కట్ట మీదుగా వచ్చే మార్గంలో 23 విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. జాతర సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించి పర్యవేక్షణ చేపడతామని పేర్కొన్నారు. ఎంపీడీఓ కృష్ణవేణి మాట్లాడుతూ జాతరను ఐదు క్లస్టర్లుగా విభజించి పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ మాట్లాడుతూ జాతరలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, మొబైల్ పెట్రోలింగ్ ద్వారా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రతిరోజు పరిస్థితిని పర్యవేక్షిస్తామని చెప్పారు.
అధికారుల గైర్హాజరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశానికి హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సర్పంచ్ కన్నెబోయిన యమునా ప్రవీణ్ కుమార్ యాదవ్‌కు సూచించారు. జాతరకు వారం రోజుల ముందు బాధ్యతలు చేపట్టిన ఆలయ ఈఓ ప్రసాద్ పనితీరుపై ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. జాతర నిర్వహణపై పూర్తి అవగాహనతో సమర్థవంతంగా వ్యవహరించాలని, ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టంగా వ్యవస్థను నిర్వహించాలని హెచ్చరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ భూముల్లో కాటేజీలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జాతరను ఘనంగా నిర్వహించి భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.


