కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరాలి
అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టండి
గెలుపే లక్ష్యంగా నాయకులు పనిచేయాలి
కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలి
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
కాకతీయ, కొత్తగూడెం : త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా, ఇల్లెందు, అశ్వరావుపేటల్లో కూడా వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలను గెలుచుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తొలిసారిగా కార్పొరేషన్ హోదాలో జరుగుతున్న కొత్తగూడెం ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. లబ్ధిదారులకు కేంద్రం నుంచి ఏ పథకాలు అందాయో స్పష్టంగా చెప్పాలని అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వ పథకాలేనని గుర్తు చేయాలన్నారు.
తెలంగాణను దోచుకున్న రెండు ప్రభుత్వాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే తన వంతు దోపిడీకి పాల్పడుతోందని కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత పన్నెండు సంవత్సరాలుగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల సంపదను లూటీ చేయడమే లక్ష్యంగా పనిచేశాయన్నారు. కాంగ్రెస్ విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆగమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సంక్షోభంలో సింగరేణి
సింగరేణి కాలరీస్ కంపెనీ పూర్తిస్థాయి సంక్షోభంలో కూరుకుపోయిందని, దీనికి కారణం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణికి రావాల్సిన సుమారు యాభై ఒక వేల కోట్ల రూపాయల బకాయిలను గత ప్రభుత్వమూ, ప్రస్తుత ప్రభుత్వమూ ఒక్క పైసా కూడా చెల్లించలేదన్నారు. బకాయిలు చెల్లించకపోవడం వల్లే సింగరేణి నష్టాల్లో నడుస్తోందని తెలిపారు. సింగరేణికి వచ్చే నిధులను ఈ రెండు పార్టీలు ఏటీఎంలా వాడుకున్నాయని అసహనం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు చేసి వెళ్లిందన్నారు. సింగరేణిలో కొత్త యంత్రాల కొనుగోలు, భద్రత చర్యల విషయంలో కూడా ఎలాంటి శ్రద్ధ చూపలేదని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను విమర్శించారు.
సింగరేణి అభివృద్ధికి సహకారం
సింగరేణి అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణిని మళ్లీ గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


