ఆయిల్ ఫామ్ సాగుతో అదిరే లాభాలు
సహకార సంఘాలు టార్గెట్ సాధించాలి
అదనపు కలెక్టర్ అశ్వినితానాజీ వాకడే
కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును విస్తృతం చేసి రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గాలు, కార్యదర్శుల అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు.ఒక్కసారి ఆయిల్ ఫామ్ తోటలు వేస్తే 30ఏళ్ల పాటు స్థిరమైన దిగుబడి వస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం నాలుగు నెలల్లో 3వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు ప్రారంభం కావాలన్నారు. ఇందుకు సహకార సంఘాల పాలకవర్గాలు, కార్యదర్శులు రైతులకు విస్తృత అవగాహన కల్పించి, టార్గెట్ చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. అంతర పంటల సాగుతో కూడిన లాభాలు, సాగు సాంకేతికత, నిర్వహణపై ఉద్యానవన శాఖ అధికారులు సమావేశంలో వివరాలు అందించారు. ఆయిల్ ఫామ్ సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయ భరోసానిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి రామానుజాచార్యులు, వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఉద్యానవన అధికారి కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు.


