గ్రామ రాజకీయం ఆరంభం
నామినేషన్ల స్వీకరణతో మారుతున్న సమీకరణాలు
ఎవరికి మద్దతివ్వాలి.. పార్టీ నాయకత్వాలకు సవాల్
ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల వద్ద భారీ రద్దీ
కాకతీయ, ములుగు ప్రతినిధి : స్థానిక సర్పంచ్ ఎన్నికలు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో ప్రతి గ్రామం రాజకీయంగా వేడెక్కింది. సర్పంచ్ అభ్యర్థుల్లో ఎవరికి పార్టీ మద్దతును ప్రకటించాలనే దానిపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ముఖ్య పార్టీల శ్రేణుల్లో చర్చలు, కసరత్తులు వేగం పుంజుకున్నాయి. ఎవరికి మద్దతివ్వాలి, ఎవరికి ఎలా నచ్చ చెప్పాలి అన్నది స్థానిక నాయకత్వానికి పెద్ద సవాలుగా మారింది. గ్రామాల్లో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. సర్పంచ్ అభ్యర్థుల పేర్లు చర్చకు రావడంతో పాత మైత్రీలు, కొత్త గుంపులు, వర్గాల మధ్య ఒప్పందాలు రూపు దిద్దుకుంటున్నాయి. కొంతమంది నేతలు తమ అనుచరులను ఒకేచోట చేర్చి సమీకరణాలు బలోపేతం చేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
బలమైన అభ్యర్థి ఎవరు?
ఏ అభ్యర్థికి మద్దతిస్తే లాభం, ఎవరికి నష్టం అన్న ఆలోచనలో పార్టీల నాయకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. స్థానిక వైషమ్యాలు, కుల సమీకరణాలు, గెలుపు అవకాశాలు అన్నిటిని తూకం వేసి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సర్పంచ్‌గా పోటీ చేసేందుకు సిద్ధమై ఉన్న అభ్యర్థులు, ప్రతి వార్డులో తమకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి వార్డు నుంచి బలమైన శ్రేణులను తనవైపు తిప్పుకోవడానికి రహస్య భేటీలు, వ్యూహాలు కొనసాగుతున్నాయి. సర్పంచ్, వార్డు పదవుల కోసం రాజకీయంగా బలమైనవారితో పాటు యువ నాయకులు కూడా రంగంలోకి దిగుతున్నారు. అయితే పార్టీ మద్దతు దొరుకుతుందా..? లేదా అన్న అనిశ్చితి, స్థానిక విభేదాలతో చాలామంది అభ్యర్థులు ఉత్కంఠలో ఉన్నారు.
మీ సేవ కేంద్రాల వద్ద అప్లికేషన్ల వెల్లువ….
నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో సర్పంచ్-వార్డు అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలను ఆశ్రయించారు. కుల, ఆదాయ, నివాసం, జనన ధ్రువీకరణ పత్రాల కోసం అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఉదయం నుంచే క్యూల్లో నిలబడ్డారు.ధ్రువీకరణ పత్రాల కోసం పాశావాహుల పరుగులు అభ్యర్థులు మాత్రమే కాదు, ప్రతినిధులుగా వ్యవహరించే ఆశావాకులు కూడా ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న చిత్రం కనిపించింది. ఎన్నికల ప్రభావంతో ఒక్కరోజులోనే దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది.


