గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క
వనం వీడి జనంలోకి వచ్చిన వనదేవతలు
ఆర్కే–వన్లో జన సంద్రోహం… భక్తుల పోటెత్తు
కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రతి రెండేళ్లకోసారి సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మక్క–సారలమ్మ జాతర ఈసారి కూడా వైభవంగా కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు అవసరమైన ఏర్పాట్లను సింగరేణి యాజమాన్యం సమకూర్చింది. ఆర్కే–వన్ పాలవాగు సమీపంలో ఏర్పాటు చేసిన గద్దెలపై బుధవారం సారలమ్మను, గురువారం సమ్మక్క తల్లిని ప్రతిష్టించారు. మందమర్రి నుంచి డప్పు చప్పులతో సమ్మక్క తల్లిని తీసుకురాగా, గద్దెల వద్ద భక్తుల జయజయధ్వానాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సింగరేణి మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణతో పాటు ఉన్నతాధికారులు తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా తల్లులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సింగరేణి ఎస్అండ్పీసీ, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది భక్తులకు సేవలందిస్తున్నారు. శుక్రవారం భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం తల్లులను తిరిగి వనంలోకి సాగనంపనుండటంతో జాతర ముగియనుంది.


