- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- 48–72 గంటల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం సొమ్ము, బోనస్ జమ..
- 8342 కొనుగోలు కేంద్రాల ద్వారా 80 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం
కాకతీయ, కరీంనగర్ : ఏ రాష్ట్రం చేయని విధంగా రికార్డు స్థాయిలో వానాకాలం పంట కొనుగోలుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ కె. రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ అత్యధిక వరి సాగు విస్తీర్ణం ప్రస్తుతం తెలంగాణలో ఉంది.
ఈ సీజన్‌లో అత్యధికంగా పంట కొనుగోలు చేయబోతుమని, ప్రతి జిల్లా కలెక్టర్ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూడాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్ఫాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు సిద్ధం ఉంచాలన్నారు. 48 నుంచి 72 గంటల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం సొమ్ము, బోనస్ జమ అవుతుందని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం పంట కొనుగోలులో మంచి పేరు సంపాదించిందని, దీపావళి తర్వాత వరి కోతలు వేగం కానున్నందున గన్ని సంచులు, రవాణా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని అన్నారు.
సీఎస్ కె. రామకృష్ణారావు మాట్లాడుతూ.. గతంలో ఉమ్మడి రాష్ట్రం కన్నా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు సమానంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఈ వానాకాలంలో 66.80 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. 1.48 కోటి మెట్రిక్ టన్నుల దిగుబడికి ప్రణాళిక సిద్ధం. అందులో 8342 కొనుగోలు కేంద్రాల ద్వారా 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుమని చెప్పారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలో 2.75 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, మూడు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఉందని తెలిపారు. ఇందుకోసం 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేమని, సిబ్బందికి శిక్షణ పూర్తయిందని తెలిపారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రజనీకాంత్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


