కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండించాలి
దాడులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపాటు
కాకతీయ, ఖమ్మం : గజ్వేల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వంలోని పార్టీ నేతలే రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం దాడులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి దాడులు, విధ్వంసాలతో ప్రజలను భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర అని ఆయన విమర్శించారు. ఇలాంటి చర్యలు తక్షణమే ఆపాలని, రాష్ట్రంలో చట్టవ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేశారు.


