- కెవిపిఎస్, ఎస్ఎఫ్ఐ
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ, కెవిపిఎస్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్, ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ అగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద కళ్లకు నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఈ దాడిని సమాజంలో ద్వేషం, మతోన్మాదం పెరిగేలా చేసే చర్యగా, న్యాయ వ్యవస్థపై బహిరంగ దాడి చేసిన చర్యగా భావిస్తున్నామన్నారు. ఈ దాడిని కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాదు, రాజ్యాంగంపై, న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించవచ్చునని, ఇది దేశమంతా హఠాత్తుగా దిగ్భ్రాంతికి గురిచేసిందని వారు తెలిపారు.
జస్టిస్ గవాయ్ పైనే కాకుండా, ఈ దాడి మన రాజ్యాంగంపై, న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడి అని అగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పేరుతో జరుగుతున్న దాడులను బుద్ధిహీనుల చర్య అని మండిపడ్డారు. ఈ దాడులు మన రాజ్యాంగానికి, న్యాయవ్యవస్థకు వ్యతిరేకం అని, భీమ్ ఆర్మీ తెలంగాణ చీఫ్ వాసాల శ్రీనివాస్ కూడా ఈ దాడిని “భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై జరుగుతున్న కుట్రలో భాగం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నిందితులను కఠినంగా శిక్షించాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కంపెల్లి అరవింద్, వినయ్ సాగర్ (నగర కార్యదర్శి), కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కొంపల్లి సాగర్, నగర కార్యదర్శి గాజుల కనకరాజ్, కాదాసీ కుమార్, బొమ్మల సాగర్, అజయ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.


