వృద్ధురాలి మెడలో నుంచి బంగారు చైన్ లాక్కెళ్లిన దుండగుడు..
కాకతీయ, వరంగల్ బ్యూరో: జనగామ మండలం చౌడారం గ్రామంలో దుండగుడు చైన్‌స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు మారోజు కౌసల్య మంగళవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో ఇంట్లో బాత్రూం వెళ్తుండగా, అప్రమత్తంగా ఎదురుచూస్తున్న దుండగుడు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఘటనపై కౌసల్య ఆర్తనాదం చేయడంతో గ్రామస్థులు పరుగెత్తి వచ్చి దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, అతడు వెంటనే చౌడారం నుంచి జనగామ వైపు పల్సర్ బైక్‌పై పరారయ్యాడు. విషయం తెలిసిన వృద్ధురాలి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జనగామ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలవరపరుస్తోంది.


