ఆవేశం కట్టలు తెంచుకుంది..!
గేట్లు బద్దలు కొట్టిన నర్సింగ్ విద్యార్థినుల
వసతులు కల్పించడం లేదని మహబూబాబాద్‌లో ఆందోళన
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ నర్సింగ్ కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కళాశాల యాజమాన్యం వైఖరికి విసుగెత్తిన నర్సింగ్ విద్యార్థినులు గేట్లు బద్దలు కొట్టి నిరసనకు దిగారు. అద్దె భవనాల్లో సరైన మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే సొంత భవనం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్థినులు బయటకు రాకుండా యాజమాన్యం గేట్లకు తాళాలు వేసి నిర్బంధించిందన్న ఆరోపణలతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు, వెనక్కి తగ్గకుండా గేట్లు బద్దలు కొట్టి బయటకు వచ్చారు. తరగతి గదులు, హాస్టల్, ల్యాబ్‌లు వంటి కనీస సౌకర్యాలు కూడా సరిగా లేవని, అద్దె భవనాల్లో చదువులు సాగించడం వల్ల భద్రత, విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడుతోందని వారు వాపోయారు.

సొంత భవనం కోసం పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని, సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థినుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని యాజమాన్యంపై మండిపడ్డారు. నిరసన సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నినాదాలు మార్మోగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థినులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని నర్సింగ్ విద్యార్థినులు హెచ్చరిస్తున్నారు.


