సర్వాంగ సుందరంగా శ్రీ మహాశక్తి దేవాలయం
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయం వసంత పంచమి మహోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శుక్రవారం జరగనున్న వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామివారి ఆశీస్సులతో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణతో అలంకరించారు. వసంత పంచమి సందర్భంగా ఉదయం 4 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు అభిషేకాలు, ఉదయం 7.30 గంటలకు మహాసరస్వతి పూజ, ఉత్సవ మూర్తికి అభిషేకం, కుంకుమార్చన, సామూహిక పుస్తక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా వేలాది మంది భక్తులు అక్షరాభ్యాసాల కోసం తరలివచ్చే ఈ ఆలయం మరో *బాసర*గా గుర్తింపు పొందింది. ఈ పూజల్లో బండి సంజయ్ కుమార్ దంపతులు పాల్గొననున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.


