తొర్రూరులో టెన్షన్ టాప్ గేర్
చైర్మన్ ఎన్నిక వేళ కాంగ్రెస్–బీఆర్ఎస్ బాహాబాహీ
ఎక్స్‌అఫీషియో ఓటుపై రాజుకున్న వివాదం
ఎంపీ కడియం కావ్య ఓటు నమోదు పై బీఆర్ఎస్ అభ్యంతరం
చైర్మన్ పీఠం కోసం ఒక్కో ఓటు కీలకంగా మారిన పరిస్థితి
ఎన్నికల కేంద్రం వద్ద కార్యకర్తల మధ్య ఘర్షణ
లాఠీచార్జ్‌తో పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు
కాకతీయ, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చైర్మన్ పీఠం కోసం ఇరు పార్టీల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా మారిన నేపథ్యంలో, ఎక్స్‌అఫీషియో ఓటు అంశం వివాదానికి దారితీసింది. దీంతో ఎన్నికల కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్ ఎంపీ కడియం కావ్య తొర్రూరు మున్సిపాలిటీలో తన ఎక్స్‌అఫీషియో ఓటును నమోదు చేసుకోవడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ఓటు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఓటు చైర్మన్ ఎన్నిక ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముండటంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తత పెరిగింది.
బలాబలాలు సమానంగా… ప్రతి ఓటు కీలకం
తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య బలాబలాలు దాదాపు సమానంగా ఉండటంతో ఒక్కో ఓటు కీలకంగా మారింది. దీంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇరు పార్టీలు తమ మద్దతుదారులను సమీకరించడంపై దృష్టి సారించాయి. ఎక్స్‌అఫీషియో ఓటు ఈ ఎన్నికలో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల కేంద్రం వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం ఎన్నికల కేంద్రం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నిక ప్రక్రియ
తొర్రూరు మున్సిపాలిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియను అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలతో తొర్రూరు మున్సిపల్ రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.


