హుజురాబాద్లో ఉద్రిక్తత
జాతరకు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్యే కుటుంబం
కాకతీయ, హుజూరాబాద్ : కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్తున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబాన్ని పోలీసులు అడ్డుకోవడం రాజకీయ దుమారాన్ని రేపింది. కేసీ క్యాంపు పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానిక దళిత మహిళా సర్పంచ్ దాసరపు సరోజనతో పాటు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు జాతరకు వెళ్తుండగా, కరీంనగర్ సీపీ ఆదేశాల మేరకు పోలీసులు అడ్డుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ప్రజాప్రతినిధిని, ఆయన కుటుంబాన్ని అనవసరంగా నిలువరించడం పోలీసుల అతిశయోక్తి చర్యగా వారు విమర్శించారు.

సమాచారం అందగానే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి హుజూరాబాద్–హన్మకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు–బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడం అన్యాయమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో తీసుకున్న నిర్ణయమని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. ఈ ఘటనను పోలీసుల ‘ఓవర్ యాక్షన్’గా అభివర్ణించిన బీఆర్ఎస్ నేతలు, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులపై నైతిక బాధ్యత విధిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల జోక్యంతో ఉద్రిక్తత సద్దుమణగగా, ధర్నాలో పాల్గొన్నవారు ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోయారు.


