మంత్రి పర్యటనలో ఉద్రిక్తత
అంబేద్కర్ భవనం పూర్తి చేయాలంటూ దళిత సంఘాల ఆందోళన
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ పర్యటన సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన అంబేద్కర్ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని దళిత సంఘాల నాయకులు మంత్రిని కోరుతూ వినతిపత్రం అందజేశారు.హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా ప్రభుత్వం – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమానికి మంత్రి పొన్న ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యక్రమం ముగిసిన అనంతరం దళిత సంఘాల నాయకులు మంత్రిని కలిసి అంబేద్కర్ భవన నిర్మాణం సంవత్సరాలుగా నిలిచిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. భవన నిర్మాణానికి తక్షణమే నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.దీనిపై మంత్రి పొన్న ప్రభాకర్ స్పందిస్తూ సమస్యకు సంబంధించిన వినతిపత్రాన్ని ఇవ్వాలని సూచించారు. వినతిపత్రాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ప్రారంభమైన అంబేద్కర్ భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని తెలిపారు. భవనం లేకపోవడంతో దళిత సంఘాల సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


