బనకచర్ల టెండర్లు రద్దు
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
అక్టోబర్ 11న టెండర్లకు ఆహ్వానం
31వ తేదీ గడువుగా నిర్ణయం
ఈక్రమంలోనే డీపీఆర్ ప్రక్రియ క్యాన్సిల్
పోలవరం అథారిటీ సమావేశంలో ప్రకటన
మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న తెలంగాణ సర్కార్
కేంద్రానికి, సీడబ్ల్యూసీకి ఫిర్యాదు
చర్చనీయాంశంగా ఆంధ్రప్రదేశ్ నిర్ణయం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అక్టోబర్ 11వ తేదీన పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి డీపీఆర్ కోసం టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు 31తేదీ గడువుగా నిర్ణయించింది. తాజాగా డీపీఆర్ కోసం ఆహ్వానించిన టెండర్లను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈమేకు హైదరాబాద్‌లో జరిగిన పోలవరం అథారిటీ సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించింది. అయితే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో డీపీఆర్ టెండర్ల రద్దు ఆసక్తికరంగా మారింది. అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలకు విరుద్ధంగా ఏపీ ఈ ప్రాజెక్టును చేపడుతుందని తెలంగాణ తొలి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. దీనిపై కేంద్రానికి, సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసింది. న్యాయపోరాటానికి కూడా సిద్ధమైంది. ఈ క్రమంలోనే బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ వెనక్కి తగ్గినట్లు ప్రకటన చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ప్రాజెక్టుపై ఏ రాష్ట్రాలకు ఎలాంటి వివాదం రాకుండా మరో ప్రణాళికతో ఏపీ ముందుకు వచ్చే అవకాశాలు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
బనకచర్లపై తెలంగాణ అభ్యంతరం
2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి.. ఏదో ఒక విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అనేక పంచాయితీలు వస్తూనే ఉన్నాయి. రాష్ట్రాలు వేరుపడి 11 ఏళ్లు దాటిపోయినా.. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ముగియడంలేదు. ఇందులో మరీ ముఖ్యంగా నీటి పంపకాల విషయంలో మాత్రం ఏటా రెండు రాష్ట్రాల మధ్య తగదాలు నెలకొంటూనే ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదుల నీటిని వినియోగించుకోవడంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీళ్ల పంచాయితీ.. కొలిక్కి రావడంలేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు.. ఇప్పటికే ఉన్న నీళ్ల లొల్లిని మరింత తీవ్రం చేసినట్లయింది. దీనిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ వాదనలను వినిపించారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తుండగా.. దీని వల్ల వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు.
అసలేంటీ గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్ట్
గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర్ దగ్గర పుట్టి అక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనించి.. అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే వర్షాకాలంలో గోదావరిలో భారీస్థాయిలో వరద పోటెత్తుతుంది. ఆ సమయంలో వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృథాగా కలిసిపోతూ ఉంటాయి. ఈనేపథ్యంలోనే సముద్రంలోకి వృథాగా పోయే నీటిని ఒడిసిపట్టి.. వాటిని కృష్ణా నదికి మళ్లించి.. రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు అందించేలా గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టును నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఏపీ సర్కార్.. జల హారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అంతేకాకుండా.. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులు సాధించుకోవడంపై దృష్టి సారించింది.
రూ.80 వేల కోట్లతో ప్రాజెక్టు ప్రతిపాదన
ఏపీ ప్రభుత్వం చెబుతున్న వివరాల ప్రకారం.. సగటున ప్రతీ సంవత్సరం గోదావరి నదిలోని 2 వేల టీఎంసీల వరద నీరు సముద్రంలో కలిసిపోతోంది. అందుకే వర్షాకాలంలో ఆ వరదనీటిలో 200 టీఎంసీలను గోదావరి నుంచి మళ్లించేందుకే ఈ ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకువచ్చినట్లు చంద్రబాబు సర్కార్ చెబుతోంది. మొత్తంగా రూ.80,112 కోట్లతో గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఏపీ సర్కార్ ప్రతిపాదించింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర జల శక్తి శాఖకు కూడా ఏపీ ప్రభుత్వం అందజేసింది. ఈ ప్రాజెక్టుతో రాయలసీమకు తాగునీటితోపాటు కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాగర్ కుడి కాలువ, వెలిగొండ, గాలేరు నగరి, కేసీ కెనాల్, తెలుగు గంగా కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని భావించారు. ఈక్రమంలోనే డీపీఆర్ ప్రక్రియ క్యాన్సిల్ చేయడం సంచలనంగా మారింది.



