ఓటుకు పది వేలు!
వినాయకుడి బొమ్మపై ఒట్టు.. చేతిలో క్యాష్
మహబూబాబాద్‌లో మైండ్ బ్లాకయ్యేలా మని పంపిణీ
‘ఎంత ఖర్చైనా గెలవాల్సిందే’ అన్న ధోరణి
ఇజ్జత్ కా సవాల్‌గా తీసుకుంటున్న అభ్యర్థులు
మూడు వార్డుల్లో తారస్థాయికి చేరిన ఖర్చు
మిగతా ప్రాంతాల్లోనూ భారీగా మద్యం, నగదు పంపిణీ
కాకతీయ, మహబూబాబాద్ : మున్సిపల్ ఎన్నికల వేళ మహబూబాబాద్ పట్టణంలో డబ్బుల పంపిణీ తంతు హద్దులు దాటుతోంది. పోలింగ్‌కు ఒక్కరోజే గడువు మిగిలి ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు ఎక్కడా తగ్గడం లేదు. కొన్ని వార్డుల్లో ఓటుకు ఏకంగా రూ.10 వేల వరకు పంపిణీ జరుగుతోందన్న వార్తలు స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి. గెలుపు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోమన్న ధోరణితో అభ్యర్థులు ముందుకెళ్తుండటంతో ఎన్నికల వాతావరణం డబ్బు రాజకీయంగా మారిపోయింది. కొన్ని కీలక వార్డుల్లో పోటీ ప్రతిష్టాత్మకంగా మారడంతో “ఇజ్జత్ కా సవాల్”గా భావించి కోట్లాది రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడటం లేదని తెలుస్తోంది.
వినాయకుడి బొమ్మపై ఒట్టు!
డబ్బు పంపిణీకి సంబంధించి అభ్యర్థులు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నట్టు సమాచారం. ఓటర్లు డబ్బు తీసుకున్న తర్వాత తమకే ఓటు వేయాలంటూ వినాయకుడి బొమ్మ, దేవుడి ఫోటో ముందు ప్రమాణం చేయించి మరీ నగదు అందజేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. “క్యాష్ పట్టు.. ఓటు మా పార్టీకే వేయాలి” అంటూ కొందరు ఏజెంట్లు ఓటర్లను ఒప్పిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రత్యేకంగా మూడు వార్డుల్లో ఈ వ్యవహారం మరింత తీవ్రంగా మారిందని తెలుస్తోంది. అక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ తారస్థాయికి చేరడంతో, డబ్బు పంపిణీ పోటీగా మారింది. ఒక్కో ఇంటికి భారీ మొత్తంలో నగదు, మద్యం సరఫరా జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డబ్బు ప్రవాహంతో వేడెక్కిన పోరు
మహబూబాబాద్ మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని సమాచారం. అభ్యర్థులు తమ ప్రతిష్టను కాపాడుకోవడం కోసం ఖర్చుకు హద్దే లేకుండా వ్యవహరిస్తున్నారు. ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఇవ్వడం, ఇంటింటికీ మద్యం పంపిణీ చేయడం సాధారణంగా మారిపోయిందని రాజకీయ వర్గాలే చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నేరుగా అభ్యర్థుల అనుచరులే రాత్రివేళల్లో డబ్బు పంపిణీ చేపడుతుండగా, మరికొన్ని చోట్ల మధ్యవర్తుల ద్వారా ఈ తంతు కొనసాగుతోందని తెలుస్తోంది. పోలింగ్ రోజు వరకు ఈ వ్యవహారం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పోలీసుల నిఘా.. అయినా ఆగని పంపిణీ
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ.3.09 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లాలోనూ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినా, డబ్బు పంపిణీ మాత్రం ఆగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలింగ్‌కు ముందు రోజు రాత్రి భారీగా నగదు పంపిణీ జరిగే అవకాశముందని అధికారులు అప్రమత్తమయ్యారు. చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ ద్వారా నిఘా పెంచామని చెబుతున్నప్పటికీ, అభ్యర్థులు కొత్త కొత్త మార్గాల్లో డబ్బు చేరవేస్తున్నారని సమాచారం. ఫిబ్రవరి 11న మహబూబాబాద్ మున్సిపాలిటీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. డబ్బు ప్రభావం ఎంత ఉన్నా, చివరకు ప్రజలు ఇచ్చే తీర్పే కీలకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డబ్బు రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టుతారా? లేక ఈసారి కూడా మనీ గెలుస్తుందా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.


