పది మార్కుల ప్రశ్న… ఒక్క మార్కు సమాధానం!
ఆర్టీఐ చట్టాన్ని లైట్ తీసుకుంటున్న అధికారుల తీరు
పూర్తి సమాచారం కోరినా పైపై జవాబులతో సరిపెట్టే వ్యవహారం
ప్రశ్న సరిగా లేదంటూ.. తమ పరిధి కాదంటూ ఎగవేతలు
వరంగల్ బల్దియా హార్టికల్చర్ విభాగం సమాధానంపై అర్జీదారుడి ఆవేదన
సమాచారం కోసం అప్పీలు తప్పదా?.. పర్యవేక్షణ లోపంపై విమర్శలు
కాకతీయ, వరంగల్ : సమాచార హక్కు చట్టం సామాన్య ప్రజలకు పారదర్శక పాలనను అందించాలనే ఉద్దేశంతో అమల్లోకి వచ్చినా.. దాని అమలు తీరు మాత్రం ప్రశ్నార్థకంగా మారుతోంది. పూర్తి వివరాలతో సమాచారం కోరితే అధికారులు మాత్రం పొడిపొడి జవాబులతో సరిపెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పది మార్కుల ప్రశ్న అడిగితే ఒక్క మార్కు సమాధానం చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలకు జవాబుదారీతనాన్ని నిర్ధారించాల్సిన చట్టమే కొందరు అధికారుల నిర్లక్ష్యంతో అర్థం కోల్పోతుందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించి.. ప్రశ్న సరిగా లేదని, తమ పరిధిలో లేదని, లేదా అసంపూర్ణ సమాధానాలతో దాటవేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.
వివరాలు కోరితే సంఖ్యలతో సరిపెట్టే సమాధానం
వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించిన టెక్నికల్, పరిపాలన అనుమతులు, వాటి ప్రతులు ఇవ్వాలని ఓ అర్జీదారు కోరాడు. అయితే సంబంధిత హార్టికల్చర్ విభాగం అధికారులు పూర్తి సమాచారం ఇవ్వకుండా పనుల సంఖ్య మాత్రమే తెలుపుతూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అడిగిన వివరాలకు సంబంధించిన పత్రాలు, అనుమతుల వివరాలు ఇవ్వకపోవడంతో అర్జీదారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “వంటకం వివరించమంటే వంకాయ అని మాత్రమే చెప్పినట్టే ఉంది అధికారుల సమాధానం” అంటూ అర్జీదారు ఎద్దేవా చేశారు. అడిగిన ప్రశ్నకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వకుండా పైపై జవాబులతో సరిపెట్టడం చట్టం ఉద్దేశ్యానికే విరుద్ధమని పేర్కొన్నారు.
ప్రశ్న సరిగా లేదంటూ ఎగవేతలు
ఆర్టీఐ కింద సమాచారం కోరినప్పుడు కొందరు అధికారులు ప్రశ్న సరిగా లేదని పేర్కొంటూ సమాచారం ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారని తెలుస్తోంది. మరికొందరు తమ పరిధిలో లేదని అర్జీలను తిరస్కరిస్తుండగా.. ఇంకొందరు అసంపూర్ణ సమాచారం ఇస్తూ బాధ్యత తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాలు కోరినా సరైన సమాధానం రాకపోవడంతో అర్జీదారులు ట్రిబ్యునల్‌లో అప్పీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో సమాచారం పొందడం సాధారణ ప్రజలకు క్లిష్టంగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లోతుగా అడిగితేనే సమాచారం?..
అధికారులు పూర్తి సమాచారం ఇవ్వకుండా ఉండటంతో అర్జీదారులు కూడా ప్రశ్నలను అత్యంత వివరంగా, విడమరిచి అడగాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణంగా అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం రాకపోవడంతో ప్రతి అంశాన్ని విడిగా అడిగితేనే వివరాలు వెల్లడిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్టీఐ చట్టం అమలు తీరును పర్యవేక్షించే వ్యవస్థ బలహీనంగా ఉండటమే ఇలాంటి ఘటనలకు కారణమని భావిస్తున్నారు. అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోయినా తక్షణ చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల నిర్లక్ష్యానికి అడ్డుకట్ట పడటం లేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం ఉద్దేశ్యాన్ని నిలబెట్టాలంటే అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, లేకపోతే ప్రజల నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.


