గట్టమ్మ ఆలయంలో గుడి మెలిగే పండుగ
ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ ప్రారంభం
మేడారం జాతర వరకూ కొనసాగే పవిత్ర ఆచారాలు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా గట్టమ్మ తల్లి దేవాలయంలో ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలకు అద్దం పట్టేలా శుద్ధి పండగ (గుడి మేలుగు)ను ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ నాయకపోడు ములుగు గట్టమ్మ తల్లి పూజారుల సంఘం అధ్యక్షుడు కొత్త సదయ్య ఆధ్వర్యంలో ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయాన్నే పూజారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిల్లిపాది శుభ్రత పాటించి ఘట్టమ్మ దేవాలయానికి చేరుకున్నారు. మొదట మొక్కల తల్లి పూర్వపు ఘట్టం వద్ద ఆదివాసీ నాయకపోడు ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అడవిలో నుంచి తీసుకొచ్చిన పాలపురుగుతో పందిరి వేసి, రంగులు వేసి, పసుపు–కుంకుమలతో బొట్లు పెట్టి, బోనాలతో పూర్వపు ఘట్టమ్మ తల్లిని ఐదు కుండల నీళ్లతో శుద్ధి చేసి అమ్మవారిని అలంకరించారు. శివశక్తుల సమక్షంలో ఘట్టమ్మ తల్లికి నైవేద్యాలను సమర్పించి నేటి నుండి శుద్ధి పండగను అధికారికంగా ప్రారంభించారు. పూర్వపు ఘట్టమ్మ అలంకరణ అనంతరం, ప్రస్తుతం ఉన్న గట్టమ్మ తల్లికి కూడా సమ్మక్క–సారలమ్మ గద్దెల చుట్టూ గుడి ఆవరణను పూర్తిగా శుభ్రం చేసి అమ్మవారిని అలంకరించి పూజారులు, వారి కుటుంబ సభ్యులు మొక్కులు చెల్లించారు. ఈ శుద్ధి పండగ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరతో ముగుస్తుందని పూజారులు తెలిపారు. ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఆచారాలతో దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో గట్టమ్మ ప్రధాన పూజారి కొత్త సురేందర్‌తో పాటు కొత్త లక్ష్మయ్య, అరిగెల సమ్మయ్య, ఆకుల మొగిలి, మోట్లపల్లి సరోజన, ఈర్పిరెడ్డి సారక్క, చిర్రా స్వరూప, ఆకుల రఘు, కొత్త రవి, కొత్త నీలయ్య, కొత్త సమ్మయ్య, అరిగెల సంజీవ, అచ్చ రాజు, అచ్చ లక్ష్మణ్, మండపు అర్జయ్య, మండపు సురేష్, కొత్త రాజ్ కుమార్, కొత్త రమేష్, చిర్రా చిరంజీవి, అరిగెల సారయ్య, చిర్రా రాజ్ కుమార్, మోట్లపల్లి స్రవంతి తదితర ఆదివాసీ నాయకపోడు ప్రధాన పూజారులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు.


