నీ అయ్యా ఆశయాలేంటో సమాజానికి చెప్పు !
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఘాటు వ్యాఖ్యలు
కాకతీయ, మంథని : పదే పదే తన తండ్రి ఆశయాల సాధన కోసమే పనిచేస్తున్నానని చెప్పుకుంటున్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ నిజంగా తన తండ్రి శ్రీపాదరావుకు రాజకీయ వారసుడైతే ఆయన ఆశయాలేంటో సమాజానికి స్పష్టంగా చెప్పాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సవాల్ విసిరారు.
మంగళవారం మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.తండ్రి ఆశయాలంటే చిన్నకాళేశ్వరం పూర్తి చేస్తానని చెప్పి ఇప్పటివరకు చేయకపోవడమేనా? ఇసుక బంద్ చేస్తానని మాట ఇచ్చి అమలు చేయకపోవడమేనా? యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించలేకపోవడమేనా అంటూ ప్రశ్నించారు.శ్రీధర్ చెప్పిన మాటలను రికార్డుల ప్రకారం ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దొంగచాటుగా వీడియోలు పెట్టించి, చెప్పులతో కొట్టిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. తనను తిట్టేవాళ్లంతా తనవాళ్లేనని, తనకు శత్రువులు కాదని, దుద్దిళ్ల కుటుంబమే తనకు రాజకీయ ప్రత్యర్థులని వ్యాఖ్యానించారు.మూడు వందల కుటుంబాలు మాత్రమే ఉన్న దుద్దిళ్ల కుటుంబానికి 40 ఏళ్లుగా ఓట్లు వేసి అధికారంలో ఉంచితే ఈ సమాజం నిర్వీర్యమవుతుందని ఆరోపించారు. ప్రజల ఆకలి, కష్టాలు, కన్నీళ్ల కోసం పోరాటం చేస్తే చెప్పులతో కొట్టిస్తానని బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.శ్రీపాదరావు మరణానంతరం దుద్దిళ్ల శ్రీధర్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ‘శ్రీధర్‌బాబు’గా నామకరణం చేసి రాజకీయ ఓనమాలు నేర్పించానని గుర్తు చేశారు. అన్నం పెట్టి ఆదరిస్తే ఈనాడు తనను తిట్టించే స్థితికి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.దుద్దిళ్ల కుటుంబ చరిత్ర తనకు పూర్తిగా తెలుసునని, అవసరమైతే కుటుంబ చరిత్ర చిట్టా మొత్తం విప్పుతానని హెచ్చరించారు. 19 వేల మెజార్టీతో ఓడించిన తనను చెప్పులతో కొట్టిస్తానని బెదిరించడం ఎంతవరకు సమంజసమో సమాజమే ఆలోచించాలని అన్నారు.తాను తుపాకీ పట్టుకుని తిరగడం లేదని, రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతున్నానని స్పష్టం చేశారు. తన కంఠంలో తుది శ్వాస ఉన్నంత వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తానని పుట్ట మధూకర్ తేల్చిచెప్పారు.


