కాకతీయ, కరీంనగర్ : జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు జరిగిన నష్టమేమిటో స్పష్టంగా చెప్పకుండా, ఇడ్లీ, దోశ, వడ అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడటం సరికాదని కేంద్ర హోం మంత్రివర్గ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. నిజంగా సమస్యలు ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందాలని సూచించారు.
కరీంనగర్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావుతో పాటు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్, బాపూజీని “తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, త్యాగమూర్తి గా అభివర్ణించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన బాపూజీ తన ఇంటిని పార్టీ ఆఫీస్‌గా మార్చి ఉద్యమానికి బలపరిచిన విషయాన్ని గుర్తుచేశారు. చేనేత, బలహీన వర్గాల కోసం జీవితాంతం కృషి చేసిన బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన జయంతి, వర్ధంతులను ప్రభుత్వ స్థాయిలో అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు (సెప్టెంబర్ 17) నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగిన ప్రయోజనాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.


