కాకతీయ, సిధ్దిపేట: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో బుధవారం నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బైరాన్‌పల్లి అమర వీరుల స్మారకానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 1948 ఆగస్టు 27న ప్రాణాలు అర్పించిన వందలాది అమరులను స్మరించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నీళ్ళు,నిధులు, నియామకాలు అనే ప్రజల ఆకాంక్షలతో ప్రారంభమై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ఆశయాలను నెరవేర్చుతుందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడంతో ఇప్పటివరకు రూ.200 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు నమోదు అయ్యాయని, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు.
ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల మంజూరు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం సున్నా వడ్డీ రుణాలను అందిస్తున్నామని, వ్యవసాయరంగంలో రైతు భరోసా కింద 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు, రైతు రుణ మాఫీ కింద రూ.23 వేల కోట్లు విడుదల చేశామని చెప్పారు. అదనంగా సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ మంజూరు చేసినట్లు తెలిపారు.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ గృహాలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. భూ సంస్కరణల కోసం భూ భారతి కార్యక్రమం ప్రారంభించి, గ్రామ భూ పరిపాలన అధికారులను నియమించామని తెలిపారు. చాకలి ఐలమ్మతో పాటు తొలి తరం, మలితరం ఉద్యమకారులను స్మరించిన మంత్రి, పెండింగ్‌లో ఉన్న అమర వీరుల స్థూపాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఒక మొక్క నాటడంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి అభినందించారు.


