కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికాలో హింస, కాల్పుల ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో విషాదం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా రామయ్య బౌలికి చెందిన 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మహమ్మద్ నిజాముద్దీన్‌ను స్థానిక పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటన సెప్టెంబర్ 3న జరిగినప్పటికీ, రెండు వారాల తర్వాతే ఈ విషయం ఆయన కుటుంబానికి తెలిసింది. దీంతో బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
2016లో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన నిజాముద్దీన్, మొదట ఫ్లోరిడాలో చదువుకొని తర్వాత కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కొంతమంది స్నేహితులతో కలిసి నివసిస్తున్నారు. సెప్టెంబర్ 3న రూమ్‌మేట్‌తో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చి, కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడని శాంటాక్లారా పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో పోలీసులు అక్కడికి చేరుకోగా, నిజాముద్దీన్ వారిని కత్తితో బెదిరించాడని తెలిపారు. దాంతో తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని భావించి కాల్పులు జరిపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఆ కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే మరణించగా, ఆయన మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసుల కథనాన్ని ఖండిస్తున్నారు. “నా కుమారుడిని ఎందుకు కాల్చి చంపారు? వేరే మార్గం లేకపోయిందా?” అంటూ తండ్రి హుస్నుద్దీన్ ప్రశ్నించారు. ఈ ఘటనపై న్యాయం చేయాలని, తన కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయంపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది.
ఇక మజ్లిస్ బచావోతహ్రీక్ (MBT) నేత అంజద్ ఉల్లా ఖాన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, మృతదేహాన్ని తెలంగాణకు రప్పించే చర్యలు తీసుకోవాలని ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. ఈ విషాద ఘటనతో నిజాముద్దీన్ కుటుంబం తీవ్ర వేదనలో ఉంది. అంత్యక్రియలు స్వదేశంలో జరపాలని కోరుతున్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం, అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ కూడా ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.


