తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా అమలు
రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి జరగాలి
మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం
కాకతీయ, స్టేషన్ ఘనపూర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. లింగాల ఘనపూర్, రఘునాథపల్లి మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లింగాల ఘనపూర్ మండలానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు రూ.60.06 లక్షల చెక్కులను, రఘునాథపల్లి మండలానికి చెందిన 95 మంది లబ్ధిదారులకు రూ.95.11 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలి
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సర్పంచులు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని, ఎన్నికల అనంతరం అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అశ్వరావుపల్లి, నవాబ్‌పేట రిజర్వాయర్లను నింపి కాలువల ద్వారా లింగాల ఘనపూర్, రఘునాథపల్లి మండలాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రెండో పంటకూ పూర్తి స్థాయిలో నీరు అందించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


