కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎమ్మెల్సీ నవీన్ ( తీన్మార్ మల్లన్న) తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ పార్టీ ఆవిర్భావాన్ని అధికారికంగా వెల్లడించారు.
తీన్మార్ మల్లన్న ఇప్పటికే తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలపై గళమెత్తుతూ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రజలతో నేరుగా మమేకమవుతూ, పారదర్శక పాలన, నిజమైన ప్రజాస్వామ్యం, రైతులు, కార్మికుల సంక్షేమం కోసం తన కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణలో ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ, మల్లన్న ప్రవేశంతో రాజకీయ వాతావరణంలో కొత్త చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆయనకు ఉన్న పాపులర్ బేస్, సోషల్ మీడియా ప్రభావం, నేరుగా మాట్లాడే ధైర్యం కొత్త పార్టీ భవిష్యత్తుపై ఆసక్తి రేకెత్తిస్తోంది.
తెలంగాణలో కొత్తగా ప్రకటించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభలో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నేలపై బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడే జెండా ఎగరబోతోంది. ఇంతకాలం బీసీలను పెద్ద పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి మోసం చేశాయి. ఇకపై ఆ అన్యాయం కొనసాగనివ్వం. ప్రతి పార్టీ బీసీలను ఎలా వంచించిందో స్పష్టమైన లెక్కలతో ప్రజల ముందు ఉంచుతాను అని ప్రకటించారు.
అదే విధంగా, సెప్టెంబర్ 17వ తేదీన పార్టీ ప్రారంభం చేసుకోవడం వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. ఈ రోజును కొందరు విమోచన దినమని, మరికొందరు విద్రోహ దినమని చెబుతారు. కానీ నిజానికి ఈ రోజే తెలంగాణ భారతదేశంలో విలీనం అయిన చారిత్రక రోజు. అందుకే ఈ ప్రత్యేకమైన తేదీని పార్టీ ఆవిర్భావ దినంగా ఎంచుకున్నాం అని స్పష్టం చేశారు.
పార్టీ విధివిధానాలు, రాబోయే కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే పూర్తి వివరాలతో ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ఆయన ప్రసంగం వల్ల బీసీలలో కొత్త ఉత్సాహం నింపిందని చెప్పవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఈ పార్టీ ఎలాంటి మార్పులను తీసుకొస్తుందో అన్న ఆసక్తి పెరుగుతోంది.


