కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఈ నిర్ణయం గ్రామీణ పాలనలో బీసీ వర్గాల ప్రాతినిధ్యం మరింత బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సవరణకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడం ద్వారా చట్టపరమైన ప్రక్రియ పూర్తయింది. గవర్నర్ ఆమోదంతో, తెలంగాణ ప్రభుత్వం తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది. దీంతో, త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పిటిసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. రెండు మూడు రోజుల్లోనే ఈ ఎన్నికల ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో బీసీ వర్గాలకు పెద్ద మైలురాయిగా నిలుస్తుంది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా గ్రామ స్థాయి నాయకులు ఈ నిర్ణయాన్ని ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తున్నారు. టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్, కురవి మండలం ఇంచార్జి మాలోత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ .. “బీసీలకు గౌరవం కల్పించే ఈ నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. పంచాయితీ రాజ్ వ్యవస్థలో బీసీ వర్గాల నాయకత్వాన్ని పెంపొందించడానికి ఇది అద్భుత అవకాశం. గ్రామీణ అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ఈ నిర్ణయం దోహదం చేస్తుంది” అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాల నుంచి ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తే, గ్రామ పంచాయితీల్లోనూ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలలోనూ బీసీల ప్రభావం మరింత పెరగనుంది.


