కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యావిధానంలో సమూల మార్పులు ప్రక్షాళన అవసరం ఉందని మా ప్రభుత్వం నిర్ణయించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త విద్యా విధానం పేదరిక నిర్మూలనకు దోహదం చేయడంతో పాటు, పిల్లల భవిష్యత్తును ప్రకాశవంతం చేసేలా ఉండాలని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యకు బలమైన ఆధారం అయి నిలిచినా, ఓపెన్ మార్కెట్ కారణంగా మన విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి సరిపోలడం లేదని వ్యాఖ్యానించారు.
ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నా, వారిలో కేవలం 15 శాతం మందికే ఉద్యోగాలు లభిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమంగా తగ్గిపోతుండగా, విద్యాశాఖకు 21 వేల కోట్లు కేటాయించినా అందులో 98 శాతం జీతాలకే ఖర్చవుతోందని వివరించారు. పేదరికాన్ని నిర్మూలించే ఏకైక మార్గం విద్యే అని, అందుకే విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమని సీఎం తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 73 లక్షల యువతకు మంచి భవిష్యత్తు అందించడం తమ లక్ష్యమని, కొత్త విద్యా విధానం దేశ విద్యా వ్యవస్థనే మార్చేలా ఉండాలని ఆయన అన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్‌లో అనేక లోపాలు ఉన్నాయని ప్రస్తావిస్తూ, ప్రస్తుతం 11 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 34 లక్షల మంది, 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని గణాంకాలను వెల్లడించారు.
విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్.ఆర్.బీ.ఎం (FRBM) పరిమితుల నుంచి మినహాయించాలని ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్లు తెలిపారు. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు సమూల మార్పులు రావాలని, పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళికబద్ధంగా పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే, దాని కోసం రాజకీయపరమైన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.


