నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కఠిన చర్యలు..
ముగ్గురిపై కేసులు నమోదు..
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఘటనలో సంచలనం..
కాకతీయ, వరంగల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో నకిలీ వైద్యులపై గట్టి చర్యలు ప్రారంభించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టి జి ఎం సి ), జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ పరిధిలో ముగ్గురు నకిలీ వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈ చర్యలు రిజిస్ట్రార్ డా. లాలయ్య కుమార్, చైర్మన్ డా. కె. మహేష్ కుమార్ ఆదేశాల మేరకు చేపట్టబడ్డాయి అని తెలిపారు.
నకిలీ వైద్యుల దందా బహిర్గతం..
శివునిపల్లి గ్రామానికి చెందిన పి. సదానందం, పి. సంపత్ అనే సోదరులు 10వ తరగతి కూడా పూర్తి చేయకుండానే డాక్టర్లుగా నటిస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు కౌన్సిల్ విచారణలో తేలింది.
అలాగే పాలకుర్తి రోడ్డులో విద్యాసాగర్ అనే వ్యక్తి నాగరాజు మెడికల్ స్టోర్స్ లో అర్హత లేకుండా ఆధునిక వైద్యుడిగా నటిస్తూ యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్లు ఇంజెక్ట్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ ముగ్గురిపై ఎన్ ఎం సి, టి ఎస్ ఎం పి ఆర్ చట్టం 34, 54 ప్రకారం కేసులు నమోదు చేయబడ్డాయి అని అన్నారు.
ప్రజలకు హెచ్చరిక..
అర్హత లేని వైద్యుల వద్ద చికిత్స చేయించ వద్దు..
అర్హతలేని ఆర్‌ఎంపీ, పిఎంపీలు ఇస్తున్న స్టెరాయిడ్లు, యాంటీ బయోటిక్స్ వలన కిడ్నీ వైఫల్యం, షుగర్ తీవ్రత, ఎముకల బలహీనతలు పెరుగుతున్నాయి. ప్రజలు వీరిని నమ్మకూడదు అని డా. వి. నరేష్ కుమార్, డా. అన్వర్ మియా, డా. కె. వెంకట స్వామి ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. నకిలీ వైద్యుల వివరాలు తెలిసినవారు వెంటనే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాట్సాప్ నంబర్ 9154382727 కు సమాచారం ఇవ్వాలని కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. డాక్టర్లుగా నటిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడే నకిలీ వైద్యులను అరికడదాం, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు, అర్హత ఉన్న డాక్టర్లను మాత్రమే సంప్రదించండి, అని టి జి ఎం సి విజ్ఞప్తి చేసింది.



