కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలపై నెలకొన్న చట్టపరమైన వివాదానికి సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన స్థానికత నిబంధనను పూర్తిగా సమర్థిస్తూ, హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపులో స్థానిక విద్యార్థులకే ప్రాధాన్యం కల్పించే ప్రభుత్వ విధానం బలపడింది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలోనే చదివిన విద్యార్థులకే స్థానికత అవకాశం ఉంటుంది. అంటే కనీసం నాలుగేళ్లపాటు ఇక్కడ చదివి ఉండాలి అన్న షరతు తప్పనిసరి అవుతుంది. ఈ నిబంధనను కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్ బెంచ్, తర్వాత డివిజన్ బెంచ్ కూడా ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడంతో రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి ప్రభుత్వ వాదనలతో ఏకీభవించింది. స్థానిక విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే ఈ నిబంధన ఉద్దేశమని స్పష్టంచేసింది. హైకోర్టు తీర్పులను పక్కనపెట్టి, ప్రభుత్వ జీవో సరైనదేనని తేల్చి చెప్పింది.
ఈ తీర్పుతో వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించిన అనుమానాలు తొలగిపోయాయి. ఇకపై తెలంగాణలో నాలుగేళ్లు నిరంతరంగా చదివిన విద్యార్థులకే స్థానిక హోదా లభిస్తుంది. దీంతో స్థానిక విద్యార్థులకు మెడికల్ సీట్లలో మరింత రక్షణ లభించనుంది.


