కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో అబ్కారీ శాఖ ఇప్పటికే అలర్ట్ అయ్యింది. ఈ నెల 9 నుంచి నామినేషన్లు దాఖలు చేయడం ప్రారంభమవుతున్న నేపథ్యంలో, అక్రమ మద్యం తరలింపు నిరోధించడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు శాఖ వెల్లడించింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణలో అక్రమంగా మద్యం రాకుండా, తనిఖీ కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల్లోని 139 పోలీస్ స్టేషన్ల పరిధిలో గుడుంబా తయారీ, సరఫరా, మద్యం అమ్మకాలపై కఠిన నిఘా విధించనుంది. నల్లబెల్లం మద్యం, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ప్రవేశం రాకుండా ప్రత్యేక తనిఖీ కేంద్రాలను పటిష్టం చేస్తున్నారు. ఛత్తీస్‌ఘడ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవడం ప్రధాన లక్ష్యంగా ఉంది. అబ్కారీ శాఖ ఇప్పటికే అక్రమ కార్యకలాపాల పూర్తి సమాచారం సేకరించి, వాటిని అడ్డుకోవడానికి కార్యాచరణను సిద్ధం చేసింది. జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం, స్టేషన్ సిబ్బంది, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పోలీసులు, రెవెన్యూ శాఖలతో కలసి నిఘా విధించడం ప్రధానంగా జరుగుతుంది.
మద్యం అమ్మకాల అధికత గమనించినప్పుడు, దుకాణాల పరిస్థితులు, అధిక అమ్మకాలకు కారణాలు, ఎవరు కొనుగోలు చేస్తున్నారో లేదా వేరే కారణాలున్నాయో అనే వివరాలను కూడా సేకరిస్తారు. ముఖ్యంగా ఎన్నికల నియమావళి పాటించడం, అక్రమ మద్యం సరఫరా అడ్డుకోవడం, గుడుంబా తయారీని నిలిపివేయడం ప్రధాన దృష్టి అని పేర్కొంది.
ఏవైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, ఎంఆర్‌పీ ధరల పై వేటు, బెల్ట్ దుకాణాలను తాత్కాలికంగా నిలుపుకోవడం వంటి కఠిన చర్యలు తీసుకునేలా ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. దుకాణదారులను పిలిపి ఎన్నికల నియమావళి గురించి అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. మొత్తం కార్యాచరణ కొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో అమలు కానుందని అధికారులు తెలిపారు.


