కవిత అరెస్ట్‌పై తెలంగాణ జాగృతి ఆగ్రహం
కాకతీయ, కరీంనగర్: ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూ నిర్వాసితులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ జాగృతి నాయకులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.వెలుగుమట్ల బాధితుల పక్షాన ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో దీక్ష ప్రారంభించిన కవితను మహిళా పోలీసులు లేకుండా అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించడం ప్రజాస్వామ్యానికి అవమానకరమని ఆయన అన్నారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా, వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న నాయకులను అడ్డుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు.నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కవిత చేపట్టిన దీక్షను అడ్డుకోవడం ప్రజల గొంతును అణచివేయడమేనని అన్నారు. ఇలాంటి అరెస్టులు, కేసులతో తెలంగాణ జాగృతి నాయకులు ఎప్పటికీ బెదిరిపోరని స్పష్టం చేశారు.వెలుగుమట్లలో స్థలాలు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం వెంటనే పక్కా ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగి ప్రభుత్వంపై తిరుగుబాటు పరిస్థితులు ఏర్పడే అవకాశముందని హెచ్చరించారు. ప్రస్తుతం కవిత హైదరాబాద్‌లో కూడా తన దీక్షను కొనసాగిస్తుండగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మద్దతు తెలుపుతున్నారని హరిప్రసాద్ తెలిపారు.


