కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ
తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన ఒకేఒక్కడు
ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారు
కేసీఆర్ పోరాటమే తెలంగాణ రాష్ట్ర సాధనకు శ్వాసయింది
విజయ్ దివస్ వేడుకల్లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
రక్తపు బొట్టు చిందకుండా తెలంగాణ తెచ్చాడు : ఎమ్మెల్సీ సిరికొండ
కేసీఆర్ త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వరాష్ట్రం
: మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్
హన్మకొండ బీఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలోఘనంగా విజయ్ దివస్ వేడుకలు
కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రా సాధనకు ఉద్యమ నేత, కేసీఆర్ తెగించి కొట్లాడాడని ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సిరికొండ మధుసూదనచారిలు గుర్తు చేశారు. కేసీఆర్ దీక్షా దివస్ 11 రోజుల కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం విజయ్ దివస్‌ను హన్మకొండ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అధ్యక్షతన ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పుట్టిన నేల కోసం అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ అంటూ కొనియాడారు. జయశంకర్ సర్ ఎందరో తెలంగాణ ఉద్యమ నేతలతో పని చేశారు. కానీ జయశంకర్ సర్ కలను నిజం చేసిన నాయకుడు కేసీఆరేనని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. జయశంకర్ సర్ చెప్పిన విషయాలను వంటపట్టించుకొని ఉద్యమాన్ని నిర్మించిన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని అన్నారు. తెలంగాణలో అనేక పోరాటాలు జరిగాయి. వాటిలో తెలంగాణ స్వరాష్ట్ర తొలి దశ, మలిదశ పోరాటాలు ప్రజలను పెద్ద ఎత్తున ప్రభావితం చేశాయని అన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర పోరాటంలో కొందరు నాయకులకు, కేసీఆర్‌కు స్పష్టమైన తేడా ఉందన్నారు. తెలంగాణలోని కొందరు నాయకులు రాజకీయ పదవుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని చేస్తే, కేసీఆరే లంగాణ కోసం రాజకీయ పదవులను త్యాగం చేసే కొత్త తరహా ఉద్యమం ప్రజల విశ్వాసాన్ని చూరగొందన్నారు. ఉద్యమాన్ని రూపొందించి, స్వరాష్ట్ర గమ్యాన్ని చేర్చారని అన్నారు.

ఓరుగల్లు నేల గొప్పది…
ఎన్నో ఉద్యమాలకు, జయశంకర్, కాళోజీ వంటి గొప్ప మహనీయులను అందించిన నేల ఓరుగల్లు ఈ వేదిక మీదుగా తెలంగాణ కోసం జరిగిన పోరాటాన్ని గుర్తు చేసుకోవడం గొప్ప అవకాశమని దేశపతి శ్రీనివాస్ అన్నారు. డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో మహాన్నతమైన రోజు, కేసీఆర్ పోరాటానికి ఫలితం, 60 ఏండ్ల కల సాకారం అయిన రోజు, ఈ రోజును స్మరించుకోవాలన్నారు. మన చరిత్రను మనం తెలుసుకోవాలి. తెలంగాణ చరిత్రను, పోరాటాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం విద్యావంతులపై, ఉద్యమకారులపై ఉందన్నారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని కారల్ మార్క్స్ అన్నారు. కేసీఆర్ పోరాడితే విజయం వస్తుందని నిరూపించి చూపారని అన్నారు. కేసీఆర్ పై విశ్వాసంతో ప్రజలు పోరాడారు. కేసీఆర్ తన నమ్మిన ప్రజల కోసం ప్రాణాలను త్యాగానికి వెనకాడకుండా పోరాడారని అన్నారు. దారి, గమ్యం, తీరం తెలియని తెలంగాణకు కేసీఆర్ నవంబర్ 29వ దీక్షా, డిసెంబర్ 9 ప్రకటన గమ్యాన్ని చేర్చిన రోజులు.. నాడు తెలంగాణకు ఆయువు పట్టు తెలంగాణ రాష్ట్ర సమితి… అందుకే టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని చాలా మంది చూశారు. కేసీఆర్ పోరాటానికి దిగి వచ్చి స్వరాష్ట్ర ప్రకటన చేశారు అన్నారు.

మన చరిత్రను మనం విస్మరించాం…
మన చరిత్రను మనం విస్మరించాం… నిర్లక్ష్యం… మన చరిత్రను మనమే రాసుకోవాలి… మన చరిత్రను మనం రాసుకోకపోతే… ఒక ఆఫ్రికన్ సామెత లాగా… సింహాలు తమ చరిత్ర తాము చెప్పుకోకపోతే… వేటగాడు చెప్పే పిట్టకథలే చరిత్ర అవుతాయి…. అందుకే కేసీఆర్, తెలంగాణ పోరాటాన్ని మనం చెప్పకపోతే.. రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ చెప్పే తప్పుడు కథలే చరిత్రలు అవుతాయని దేశపతి శ్రీనివాస్ అన్నారు. డిసెంబర్ 9 నాటి వరకు కేసీఆర్ చేసిన దీక్ష కారణంగానే తెలంగాణ వచ్చింది. నేడు కొందరు కాంగ్రెస్ నాయకులు, మహేష్ కుమార్ గౌడ్ లాంటి వారు కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు అంటున్నారు. అది ముమ్మూటికీ తప్పు…కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చింది. అది చరిత్ర, కేసీఆర్ వలనే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ వాళ్లు అన్నది నిజం అయితే మరి స్వతంత్రం బ్రిటీష్ వాడు ఇచ్చాడా… విక్టోరియా రాణి ఇచ్చిందా… ఇలా బానిసత్వం ఉన్నవారు ఆలోచిస్తారు… తెలంగాణ విషయంలోనూ బానిసత్వ కోణంలో మహేష్ కుమార్ గౌడ్ ఆలోచిస్తున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ స్ఫూర్తితోనే కొట్లాడుతాం.. : వినయ్ భాస్కర్
ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. 14ఏళ్ల పాటు స్వరాష్ట్రం కోసం కేసీఆర్ పోరాడారని అన్నారు. తెలంగాణ వనరులు తెలంగాణకే దక్కాలని స్వరాష్ట్రం కోసం గాంధేయ మార్గంలో పోరాడి తెలంగాణ సాధించారని అన్నారు. 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని కఠోర దీక్షతో తెలంగాణను సాధించారని అన్నారు. కేసీఆర్ పోరాటం వలనే తెలంగాణ వచ్చిందని అన్నారు. ఇది చరిత్ర చెరిపేయలేని నిజమన్నారు. కేసీఆర్ పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలనే 11 రోజుల పాటు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రం కోసం, 10 ఏళ్లు తెలంగాణ నిర్మాణానికి పని చేయడం జరిగిందన్నారు. కేసీఆర్ స్ఫూర్తితోనే నేడు ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై రెండేళ్లుగా పోరాడుతున్నామని అన్నారు. బీఆర్ఎస్, హనుమకొండ జిల్లా కార్యాలయం జనతా గ్యారెజీలా మారి, పేదల పక్షాన పోరాడుతున్నామని అన్నారు.

ఒక్క రక్తపు బొట్టు కారకుండా తెలంగాణ తెచ్చాడు : ఎమ్మెల్సీ సిరికొండ
జై తెలంగాణ అనడం కూడా నేరంగా ఉన్న రోజుల్లో.. కేసీఆర్ 2001లో చెప్పినట్లుగానే.. ఒక్క రక్తపు బొట్టు కారనివ్వకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అన్నారు.
ప్రపంచంలో ఏ నాయకుడు చేయని విధంగా కేసీఆర్ రాష్ట్ర సాధనకు పోరాడారని గుర్తు చేశారు. భావజాల వ్యాప్తి, ఉద్యమ వ్యాప్తి, పదవుల త్యాగం, రాజీనామాల పరంపర, ప్రజలను చైతన్యం చేయడం, సభలు నిర్వహించడం వంటి గొప్ప నిర్ణయాలతో ఉద్యమాన్ని ఉవ్తెత్తున ఎగిసి పడేలా. గ్రామ గ్రామానికి చేరేలా పంథతో ముందుకెళ్లారని అన్నారు. 25 లక్షల మందితో ప్రపంచంలోనే గొప్ప సభను వరంగల్ వేదికగా కేసీఆర్ నిర్వహించారని అన్నారు. తెలంగాణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాన్ని నడిపారని అన్నారు. రాష్ట్ర సాధనకు ఏ నాయకుడు ప్రాణ త్యాగానికి సిద్ధ పడలేదు. కానీ కేసీఆర్ తాను సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కొట్లాడారని అన్నారు. తెలంగాణను సాధించారు. తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్. తెలంగాణను, ఉద్యమాన్ని, నాయకత్వాన్ని అణచివేయాలని కాంగ్రెస్ చూసింది.. అమరుల త్యాగం, సబ్బండ వర్గాల పోరాటంతోనే తెలంగాణ సాధించాం. తెలంగాణ వచ్చాక తెలంగాణపై కుట్రలు జరిగాయి.. 10 ఏళ్లలో అన్ని అనుమానాలను కేసీఆర్ పటాపంచలు చేశారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, విద్యుత్, తాగునీరు, సాగునీరు అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రభాగన నిలిపిన ఘనత కేసీఆర్‌కు దక్కతుందని సిరికొండ అన్నారు. కానీ నేడు తెలంగాణ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతోంది. 420 హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదు, ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాడుతోంది. మోసాలు, కూల్చివేతలు, ఎగవేతలతో ఈ కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలన సాగుతోంది. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అప్పులు పెరిగి, ఆదాయం పడిపోతోంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలందరు గమనించాలని అన్నారు.

తెలంగాణ తల్లికి నివాళులు.. టపాసులు పేల్చి సంబరాలు..!
అంతకు ముందు అంబేద్కర్ సర్కిల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఏకశిలా పార్కులోని ప్రొఫెసర్ జయశంకర్, బాలసముద్రలోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బైక్ ర్యాలీతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రకటన సందర్భంగా గాల్లోకి బెలూన్లు ఎగరవేసి, టపాసులు పేల్చారు. తరువాత బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విద్యార్థుల వ్యాసరచన పోటీల విజేతలకు నజరానాలు అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో గాంధీ టు గాంధీ పాదయాత్ర చేసిన ప్రముఖులను సత్కరించారు.



