కాకతీయ, ఢిల్లీ : తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, పెట్టుబడులు, యువత నైపుణ్యాలు, క్రీడలు, పర్యావరణం, రవాణా రంగాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పి ఏ ఎఫ్ ఐ) 12వ వార్షిక సదస్సులో కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర పరిపాలనకు రాజకీయ సంకల్పం అవసరమని, భవిష్యత్ తరాల కోసం అవకాశాలు సృష్టించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలోనే కొత్త రాష్ట్రం అయినా తెలంగాణకు, హైద్రాబాద్‌కు గొప్ప చరిత్ర ఉందని గుర్తుచేశారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ విజన్ డాక్యు మెంట్ – 2047 రూపొందించామని తెలిపారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. కోర్ అర్బన్ ప్రాంతాల్లో కాలుష్య కారక పరిశ్రమలను నగరానికి వెలుపలికి తరలిస్తున్నామని చెప్పారు. మెట్రో రైలును 70కి.మీ.ల నుంచి 150కి.మీ.లకు విస్తరించి, రోజూ ప్రయాణికులను 5 లక్షల నుంచి 15 లక్షల వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మూసీ నదిని సబర్మతి తీరంలా అభివృద్ధి చేయాలని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, రీజినల్ రింగ్ రోడ్, విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ అనుసంధానం వంటి ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని తెలిపారు.
పెట్టుబడిదారులను తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానిస్తూ.. మీ పెట్టు బడులకు పూర్తి భద్రత ఇస్తాం, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి అని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని గర్వంగా తెలిపారు. యువత నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, క్రీడల్లో ప్రతిభ పెంపు కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపించినట్లు చెప్పారు. 2025, డిసెంబర్ 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తాం అని ప్రకటించారు.
బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40% వాటా తెలంగాణ దేనని, వ్యాక్సిన్ తయారీలో హైద్రాబాద్ ప్రపంచవ్యాప్తంగా ముందంజలో ఉందని గుర్తుచేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై వ్యాఖ్యానిస్తూ.. ట్రంప్ ఒక రోజు మోదీ నా ఫ్రెండ్ అంటాడు, మరో రోజు సుంకాలు వేస్తాడు. అలాంటి ట్రంప్ ఒకప్పుడు తెలంగాణలో కూడా ఉన్నాడు, కానీ ప్రజలు పక్కన పెట్టారు అని ఎద్దేవా చేశారు. రాత్రి వచ్చిన ఆలోచన తెల్లారే అమలు కాదు, భవిష్యత్ దృష్టితోనే తెలంగాణను తీర్చిదిద్దుతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


