కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పై జారీ చేసి జీవోపై హైకోర్టులో వాదనలు వాడీవేడిగా సాగుతున్నాయి. గవర్నర్ వద్ద బీసీ బిల్లు ఇంకా పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం జీవో విడుదల చేయడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. బిల్లు ఆమోదం పొందకముందే ముందుకు సాగడం చట్టపరంగా సరైన ప్రక్రియ కాదని జడ్జీలు స్పష్టం చేశారు.
హైకోర్టు, “రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధన ఉంది కదా?” అంటూ అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. ఈ విషయంలో అనేక క్లారిఫికేషన్లు ఇవ్వాలని కోర్టు కోరింది. అయితే అడ్వకేట్ జనరల్ దసరా సెలవుల తర్వాత ఈ అంశాన్ని వినాలని కోరారు.
దీనిపై హైకోర్టు స్పందిస్తూ, “మీరు చెప్పినప్పుడు వింటాం. కానీ అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకూడదని చెబితే, ఆ దిశగా ఆదేశాలు ఇవ్వవచ్చు” అని సూచించింది. దీనిపై ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకుని చెప్పుతామని అడ్వకేట్ జనరల్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం కేసు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యలో హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.


