కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల దాటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా శుక్రవారం, శనివారం రోజుల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించింది.
శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. శనివారం రోజున వర్షాలు మరింత విస్తరించి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.
ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. భువనగిరి–చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవల్ బ్రిడ్జి మీదుగా వరద కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మొదట వాహనాలను అనుమతించినా, ప్రవాహం తీవ్రత పెరగటంతో పోలీసులు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో వందలాది వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి.
గురువారం మధ్యాహ్నం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. వీటిలో రంగారెడ్డి జిల్లా యాచారం అత్యధికంగా 18 సెం.మీ. వర్షపాతం నమోదు చేసింది. ములుగు జిల్లా మల్లంపల్లి, యాదాద్రి జిల్లా కొలనుపాకలో 17.6 సెం.మీ. వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా మోటకొండూరులో 16.5 సెం.మీ., సిద్దిపేట జిల్లా దూల్మిట్టలో 15.3 సెం.మీ., రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో 10.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
వర్షాల దృష్ట్యా అధికారులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తక్కువ స్థాయిలో ఉన్న వంతెనలు, వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయకూడదని ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో వర్షాల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున వాతావరణ అప్‌డేట్స్‌ను గమనిస్తూ సురక్షితంగా ఉండాలని హెచ్చరికలు వెలువడుతున్నాయి.


