కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, అలాగే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కొత్త రైల్వే లైన్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ లైన్ పూర్తి అయితే తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడటమే కాకుండా ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం అవుతుందని సీఎం పేర్కొన్నారు.
అదేవిధంగా, తెలంగాణలోని ఇండస్ట్రియల్ సెక్టార్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు అవసరమని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పరిశ్రమల అభివృద్ధి, ఎగుమతుల పెరుగుదల సాధ్యమవుతుందని తెలిపారు.
అదేవిధంగా రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని రీజనల్ రింగ్ రైల్ అత్యవసరమని ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. ఇది ఏర్పడితే హైదరాబాద్ చుట్టుపక్కల రైల్వే రవాణా మరింత వేగవంతమవుతుందని చెప్పారు. భవిష్యత్‌లో అవసరమయ్యే కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలను పరిశీలించాలి అని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణలో రాబోయే దశాబ్దాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రైల్వే మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
మరోవైపు, శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్త రైల్వే కనెక్టివిటీ అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. ప్రస్తుతం ఉన్న లైన్‌తో పోలిస్తే కొత్త లైన్ ఏర్పడితే ప్రయాణ దూరం తగ్గుతుందని, ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా వేగవంతమైన రవాణాకు దోహదం చేస్తుందని సీఎం చెప్పారు. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ సూచనలు, తెలంగాణ భవిష్యత్ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు దారితీయనున్నాయి.


