కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మహిళా అభ్యర్థులకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించబోతోంది ప్రభుత్వం. రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత సమస్య పరిష్కారం దిశగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతులు, ఉద్యోగ విరమణల కారణంగా ఏర్పడిన మొత్తం 15,274 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నియామకాల ద్వారా చిన్నారులకు పోషకాహారం, పూర్వ ప్రాథమిక విద్య, ఆరోగ్య సంబంధిత సేవలు మరింత సమర్థవంతంగా అందే అవకాశం ఉంది.
ప్రస్తుతం అనేక అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులు లేకపోవడంతో పిల్లలకు సరైన పాఠాలు చెప్పడం, పోషకాహారం అందించడం కష్టంగా మారింది. కొన్ని చోట్ల సహాయకులు లేని కారణంగా పిల్లలకు భోజనం వండడం, పంపిణీ చేయడం సమస్యగా మారగా, టీచర్లు లేని చోట పూర్వప్రాథమిక విద్య దాదాపు నిలిచిపోయింది. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
అంగన్‌వాడీ నియామకాలలో ఏ మార్పులు అవసరమో తెలుసుకోవడానికి శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల విధానాలను పరిశీలించి నివేదిక సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి అర్హతతో పరీక్షలు నిర్వహించి, అదనంగా ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయిస్తున్నారు. కర్ణాటక లో 12వ తరగతి అర్హతతో పాటు కన్నడ భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. ECE, నర్సరీ లేదా NTT డిప్లొమా ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కేరళ లో ICDS అధికారులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి, మెరిట్ ఆధారంగా స్థానిక మహిళలను ఎంపిక చేస్తున్నారు. ఇక తమిళనాడు లో వర్కర్ పోస్టులకు ఇంటర్, హెల్పర్ పోస్టులకు పదో తరగతి అర్హత అవసరం ఉంటుంది. ఆఫ్‌లైన్ దరఖాస్తులు తీసుకుని మెరిట్ ఆధారంగా నియామకాలు చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్మీడియట్ అర్హతతో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల విధానాలను పరిశీలించిన ప్రభుత్వం, మరింత పారదర్శకంగా, వేగంగా నియామకాలు జరిపేందుకు కొత్త మార్పులు తేవాలని యోచిస్తోంది. దీనిలో స్థానిక మహిళలకు ప్రాధాన్యం, మెరిట్ ఆధారంగా న్యాయమైన ఎంపిక వంటి అంశాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ మార్పులు పూర్తయిన వెంటనే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నియామకాలు జరిగితే రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు కొత్త ఊపిరి పీలుస్తాయి. చిన్నారులకు పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంబంధిత సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


