తేజస్ క్రాష్: దేశం కోల్పోయిన ధీరుడు.. ఎవరీ నమాన్ష్ స్యాల్?
దుబాయ్ ఆకాశంలో విషాదం
దేశం కోసం ప్రాణం అర్పించిన పైలట్ నమాన్ష్ స్యాల్
NDA నుంచి ఆకాశ యోధుడిగా నమాన్ష్ ప్రయాణం
కాకతీయ, నేషనల్ డెస్క్: దుబాయ్ ఎయిర్‌షోలో తేజస్ యుద్ధవిమానం కూలిన ఘటన భారత్‌ను తీవ్ర విషాదంలో ముంచింది. నవంబర్ 21న మధ్యాహ్నం 2 గంటల సమయంలో తేజస్-ఎమ్కే1 ప్రదర్శన విన్యాసాలు చేస్తున్న క్షణాల్లోనే విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి నేలపై పడిపోయింది. భారీగా మంటలు చెలరేగి, కేవలం కొన్ని క్షణాల్లోనే ఆకాశయోధుడు వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు. 34 ఏళ్ల నమాన్ష్ స్యాల్… భారత వైమానిక దళంలో ఒక ప్రతిభావంతుడైన పైలట్. విన్యాసాలు, ఫ్లైయింగ్ టెక్నిక్స్‌లో నైపుణ్యంతో ప్రత్యేక పేరు సంపాదించుకున్న ఆయనకు, ఈ దుబాయ్ ఎయిర్‌షో ప్రత్యేకమైన అసైన్మెంట్. అయితే ఈ ప్రదర్శనే చివరి ప్రయాణమవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
నమాన్ష్ స్యాల్ హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్ర జిల్లాలో జన్మించాడు. పఠియాల్కర్ గ్రామంలో పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచి డిఫెన్స్‌పై ఆసక్తి పెంచుకున్నారు. తండ్రి జగన్నాథ్ స్యాల్ కూడా ఆర్మీలో పనిచేయడం ఆయనకు ప్రేరణ. సుజన్పూర్ సైనిక్ స్కూల్లో చదువుకుంటూ ఆర్మీ జీవితం గురించిన స్పష్టమైన దారిని ఏర్పరుచుకున్నారు. 2009లో నమాన్ష్ NDA పరీక్షను క్రాక్ చేసి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అడుగుపెట్టారు. మొదటినుంచి శ్రద్ధగా, క్రమశిక్షణతో పనిచేసిన ఆయన, తక్కువ సమయంలోనే ప్రతిభాపాటవాలు చూపించి వింగ్ కమాండర్ స్థాయికి చేరుకున్నారు. తేజస్ MK-1 వంటి అత్యాధునిక ఫైటర్ జెట్లను నడపడం అంటే ప్రత్యేక నైపుణ్యం అవసరం.. ఆ నమ్మకాన్ని నమాన్ష్ స్యాల్ సంపాదించారు.
నమాన్ష్‌కు భార్య, ఓ చిన్నారి కూతురు ఉన్నారు. భార్య కూడా భారత వైమానిక దళంలోనే పని చేస్తోంది. నమాన్ష్ తల్లిదండ్రులు ప్రస్తుతం కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమీపంలో నివసిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమాచారాన్ని తొలిసారి యూట్యూబ్ వీడియోలో చూశానని తండ్రి జగన్నాథ్ స్యాల్ చెప్పారు. ఆరుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులు ఇంటికి రావడం చూసి, ఏదో అనర్థం జరిగిందని అర్థమైందని ఆయన వెల్లడించారు. నమాన్ష్ ఎప్పుడూ చదువులో, ఫిజికల్ ట్రైనింగ్‌లో కృషి చేసే వ్యక్తి అని, ఏదీ అర్ధాంతరంగా వదిలిపెట్టేవాడు కాదని ఆయన తండ్రి చెప్పారు. దేశ సేవలోనూ అదే నిబద్ధత కనబరిచాడని కన్నీటి స్వరంతో ఆయన గుర్తుచేసుకున్నారు. వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్… ఆకాశాన్నే తన ఇల్లు చేసుకున్న యోధుడు. దేశం కోసం ప్రాణం అర్పించిన వీరుడు. ఆయన సేవలకు భారతం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది.


