ఉపాధ్యాయుల బోధన పద్ధతి మారాలి
జడ్పీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ సిటీ : నగరంలోని సుందరయ్య నగర్ జెడ్ పిఎస్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద సందర్శించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల, విద్యార్థుల ఎఫ్ఆర్ సి హాజరును పరిశీలించారు. అలాగే పదవ తరగతి విద్యార్థుల తెలుగు, ఇంగ్లీష్ హిందీ భాషల పఠన సామర్థ్యాన్ని కలెక్టర్ పరిశీలించి, విద్యార్థులు సక్రమంగా చదవకపోవడంపై సంబంధిత ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లు బోధన పద్ధతులను మార్చుకోవాలని, అందుకుగాను ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.
పాఠశాలలో వసతులు, విద్యార్థుల మెనూ, వంటగదిని పరిశీలించారు. రోజువారి మెనూ పక్కగా అమలు చేయాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని, అందరూ విద్యార్థులు యూనిఫామ్ ధరించి పాఠశాలకు వచ్చేలా చూడాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. అధికారులచే నిరంతరం ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, ఏదైనా లోపం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న రెండు గదుల మరమ్మతులకు చర్యలు చేపట్టాలని డీఈఓ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఎంహెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, డీఈఓ జ్ఞానేశ్వర్, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.


